భీమవరంలో శుక్రవారం ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
పశ్చిమ గోదావరి : ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి.
మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని
వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్
కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ధ్వజమెత్తారు. భీమవరంలో శుక్రవారం ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో
పాల్గొన్న సీఎం జగన్ ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మనసు
రాని ఒకాయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14
సంవత్సరాలు సీఎంగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని
ఉపయోగించలేదు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించారని,
వీళ్లందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు
గుర్తు పెట్టుకొనేటట్టుగా పాలన చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది
పంచుకోవడంమాత్రమే జరిగాయన్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా
చేయగలిగాడు. ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేదని ఆలోచన చేయాలి.
వాళ్లు చేసిన పరిపాలన వల్ల వాళ్లు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు.
విశ్వసనీయత అంతకన్నా లేదు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి
చేయడం కోసం కాదు. వాళ్లు బాగుపడటం కోసమే. వాళ్లందరినీ కూడా అడగాలని మీ అందరినీ
కోరుతున్నానన్నారు.
వారికి ఓటు వేయడం కూడా ధర్మమేనా : దుష్ట చతుష్టయానికి చెందిన ఈ గ్యాంగ్,
ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతా. ఈ
దత్తపుత్రుడుది పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు.
నాన్ లోకల్. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవారు సీఎం కావాలని
పార్టీ పెట్టిన వారు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండరు. బాబు ముఖ్యమంత్రి
అయితే చాలు…అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు
అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని, ఈ విషయంలో వేరే అభిప్రాయం
కూడా ఉండదని చెబుతారన్నారు. తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో
ఉపన్యాసాలు ఇచ్చే వారిని ఎవరినీ చూసి ఉండం. ఈయనను తప్ప. ప్రజల కోసం త్యాగాలు
చేసేవారిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం.
ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం.
రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా
కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజీ స్టార్. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా
మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ
నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి
చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం. ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను
మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారంటే ఆలోచన
చేయాలన్నారు. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన
ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు
అయితే, ఇలాంటి వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ
చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి
ఏమిటి? . ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో,
రాజకీయాల్లో ఇలాంటి వారికి ఓటు వేయడం కూడా ధర్మమేనా? . ఇలాంటి ఆయన ఏ
భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు. పొలిటికల్ లైఫ్ లో మాత్రం
చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు
చెబుతున్నాడని విమర్శించారు.
పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా : నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని
మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? .
నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి
పెరుగుతుందా?. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును
వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల
మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు.
ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు
పెడుతున్న ఈ దత్తపుత్రుడు. వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబం అయినా,
పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా? . ఇటువంటి
క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి
జరుగుతుందా?. వీరి చరిత్ర మరికొంత వివరంగా చెబుతా. చంద్రబాబు ఈ మనిషి వయసు 75
సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 3 సార్లు సీఎం అయ్యాడు.
మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు. ఆ
మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి?. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల
కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా,ఎప్పుడైనా ఈ పెద్దమనిషి చేసి
ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ఓటు వేయాలని అడగాలి.
మన అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం తాను అమలు చేసి ఉంటే చేశాను అని ఓటు
అడగాలన్నారు.