జగన్ పాలనలోనే సామాజిక న్యాయం : మంత్రి మేరుగ నాగార్జున
ప్రజలు గుర్తించాలి : ఎంపీ మోపిదేవి వెంకటరమణ
కృష్ణా జిల్లా : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని
వివరిస్తూ వారిని చైతన్య పరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు
యాత్ర పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాగింది. కంకిపాడు ప్రధాన సెంటర్లో
జరిగిన బహిరంగ సభలో ప్రజలకు సంక్షేమ పాలనను ప్రజాప్రతినిధులు, నాయకులు
వివరించారు. తాడిగడప వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం మంత్రులు,
ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగింది.
చంద్రబాబుకు ఇదే నా సవాల్ : మంత్రి జోగి రమేష్
దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఒకే ఒక్క సీఎం జగన్ అని మంత్రి జోగి
రమేష్ అన్నారు. 14 ఏళ్లలో సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు
ఉందా?. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు వందల కోట్లకు అమ్ముకున్నాడు. నలుగురు
బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపించారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు ఇదే నా
సవాల్. మీ మేనిఫెస్టోతో రండి.. మా మేనిఫెస్టోతో వస్తాం. చర్చించే దమ్ముందా?.
చంద్రబాబుకే గ్యారంటీ లేదు. ఇక మనకేం గ్యారంటీ ఇస్తాడని ప్రశ్నించారు.
జగన్ పాలనలోనే సామాజిక న్యాయం : మంత్రి మేరుగ నాగార్జున
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రి మేరుగ నాగార్జున
అన్నారు. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు సీఎం జగన్. చంద్రబాబు ఏరోజూ
వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ
నెరవేర్చలేదు. వెనుకబడిన వర్గాలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసిందని
ఆరోపించారు.
ప్రజలు గుర్తించాలి : ఎంపీ మోపిదేవి వెంకటరమణ
అణగారిన వర్గాలను గతంలో ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ
అన్నారు. సంక్షేమాన్ని అందిస్తూ సీఎం జగన్ దేశంలోనే గొప్ప నాయకుడిగా
నిలిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు మరోమారు పొత్తులతో చంద్రబాబు, పవన్
వస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాన్ని అందించిందో
ప్రజలు గుర్తించాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ని సీఎంగా చేసుకోవాలి.
సీఎం జగన్ ఉంటేనే మన భవిష్యత్తు మారుతుందన్నారు.