ల్యాండ్, శ్యాండ్, లిక్కర్ తో కోట్లాది రూపాయిల ముడుపులు
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : ప్రభుత్వంలో దీర్ఘకాలం పని చేసిన తహశీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియజేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వ అవినీతిని
ప్రశ్నిస్తుందని వివరించారు. ల్యాండ్, శ్యాండ్, లిక్కర్ తో కోట్లాది రూపాయిల
ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఆరోపించారు.
మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేసారని ఆయన
విమర్శించారు. డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్ లో జరిగే
మోసాలు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. తహశీల్దారు స్థాయి వ్యక్తి
చెప్పినవన్నీ నిజాలేనన్న పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు దీనికి రాష్ట్ర
ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
హస్తం గుర్తుతో ఉన్నదే అసలైన కాంగ్రెస్ : నిధులు లేని కారణంగా మంత్రులు, ఇతర
ఉన్నతాధికారులు వచ్చినప్పుడు దిక్కలేని పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11
లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా కొందరు పెద్దలు అన్నీ దోచుకుని
అమ్ముకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా
ఉన్నా సీఎం జగన్ తో పాటు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం చాలా ధనవంతులని
ఎద్దేవా చేశారు. ఆఖరికి చిన్న స్థలమో, పొలమో రిజిష్ట్రేషన్లు చేయించుకున్నా
వైసీపీ నేతలు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని
పీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చర్యల్ని తాము సమర్థించమని,
అయినా వ్యవస్థలో లోపాల్ని సరి చేయకుండా దానిని బయటకు చెప్పిన వ్యక్తుల్ని
శిక్షించడం వల్ల ఉపయోగం లేదని పీసీసీ అధ్యక్షులు తేల్చి చెప్పారు. సీఎం జగన్
వ్యవహార శైలి ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యిందని తెలిపిన పీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రజలు ఇకనైనా హస్తం గుర్తుతో ఉన్నదే అసలైన
కాంగ్రెస్ అని గుర్తించాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చూసి
వైసీపీ పార్టీకి, జగన్ కు ఓటేశారని, ఇప్పుడు అది డూప్లికేట్ కాంగ్రెస్ అని
తేలిపోయిందన్నారు. ప్రజలు మెరుగైన పాలన కోసం వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు
ఓటేసి నిజమైన కాంగ్రెస్ పార్టిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
27న ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశం : రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ,
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాకూర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న బుధవారం ఢిల్లీలో
సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 30 మంది ముఖ్యులతో జరిగే ఈ సమావేశంలో
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు
వెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నట్లు వివరించారు. యువజన కాంగ్రెస్
రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఆంధ్రరత్న భవన్ లో జరిగింది. దీనికి
ప్రారంభోపన్యాసం చేసిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు యూత్ కాంగ్రెస్
విభాగం మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల నేపధ్యంలో
ఏ విధంగా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న దానిపై యువజన
కాంగ్రెస్ కార్యకర్తకలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏఐసీసీ యూత్ కాంగ్రెస్
ఇన్చార్జ్ అధ్యక్షుడు కృష్ణ ఆళ్వార్ మాట్లాడుతూ యుతవకు ఎన్ని ఉద్యోగాలు
ఇచ్చారు. ప్రత్యేక హోదా ఏమయ్యింది. విద్యా వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న
చర్యలను రాష్ట్రంలోని యువతకు వివరించి… మళ్లా వచ్చే ఎన్నికల్లో ఓటు
అడగటానికి వెళ్లాలని సవాలు విసిరారు. ఒకటి నుంచి రెండో తరగతికి వెళ్లాలంటేనే
ప్రోగెస్ చూసి పంపుతారని అటువంటిది వైసీపీ ఎన్నికలకు వెళ్లేప్పుడు ఏం చేశారో
చెప్పి ప్రజలను ఓటు అడగాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక, తెలంగాణ ఫార్ములా : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర
అధ్యక్షులు ఎల్ రామారావు మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణ ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్
లో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయవచ్చో అనే
దానిపై యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని
ప్రకటించారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, సుంకర
పద్మశ్రీ, ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, యూత్ కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ లు
రక్ష రామయ్య, మమత నాగిరెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి
శంకర్ దయాళ్ శర్మ, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్థంతి
కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వారి
చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రంగా బలిదానంతోనే 1989
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా
వివరించారు. విజయవాడలో సింగ్ నగర్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన రంగా
వర్థంతి కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తో పాటు పలువురు
నేతలు పాల్గొని పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.