సర్వేలలోనే ఈ అంశం తేలిపోవడంతో ఆ పార్టీ అధ్యక్షడు జగన్ ఇప్పుడు ప్రక్షాళన
చేపట్టారు. ప్రజలలో అసంతృప్తితో ఈసారి అధికారం దక్కడం గగనమేనని తేలిపోగా కనీసం
పరువు నిలిపే స్థానాలైనా దక్కించుకోవాలని జగన్ ఇప్పుడు ఆరాటపడుతున్నట్లుగా
కనిపిస్తుంది. ఇందుకు అభ్యర్థుల మార్పు ఒక్కటే వైసీపీకి ఆధారంగా
కనిపించినట్లుంది. అందుకే జగన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పు
చేస్తున్నారు. మంత్రులు, సీనియర్లు, సన్నిహితులు అనేది కూడా లేకుండా
ఎక్కడిక్కడ అభ్యర్థులను మార్చేసి ఇంచార్జిలుగా ప్రకటిస్తున్నారు.
మరికొందరికైతే అసలు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో కొందరు రాజీనామాల బాట
పడితే.. మరికొందరు తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అసలే
నాలుగేళ్లుగా గ్రూపు రాజకీయాలతో సతమతవుతున్న వైసీపీకి ఇప్పుడు ఈ సీట్ల కొట్లాట
తోడై పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి
జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది. రెండు ఎంపీ స్థానాలు
కూడా దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల
గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు నెలలకే ఇక్కడ వైసీపీలో ముసలం పుట్టింది.
ముందుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్పై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత
ఇక్కడ వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోగా ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు
దువ్వుతున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి
సుభాష్ చంద్రబోస్ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి బహిరంగంగానే సవాళ్లు
విసురుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు.
ఈసారి తనకే సీటు దక్కుతుందని ప్రకటించిన ఎంపీ పిల్లి.. వైసీపీ అధిష్టానానికి
కూడా అల్టిమేటం జారీచేశారు. మొత్తంగా ఇప్పుడు రామచంద్రాపురం సీటుని మంత్రి
చెల్లుబోయినను కాదని పిల్లి ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. మంత్రి వేణును
ఇప్పుడు రాజమండ్రికి పంపిస్తున్నారు. కానీ, ఇక్కడ మంత్రి వేణు వర్గం పిల్లితో
కలిసే పరిస్థితి లేకపోగా.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పిల్లిని ఓడించేందుకు
కంకణం కట్టుకోగా మరికొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు.
ఇక రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ భరత్ ను పోటీ చేయిస్తున్నారు. భరత్ ఎంపీగా
పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ వర్గాలతో పాటు అధికారులు,
సామాన్య ప్రజలలో భరత్ పై తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ
నుండి పోటీ చేసినా సొంత పార్టీ కార్యకర్తలే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు.
అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాథ మధ్య యుద్ధం
తారాస్థాయికి చేరింది. ఎవరిని ఎక్కడకి పంపినా ఒకరినొకరు ఓడించుకోవడమే వారి
ప్రాధాన్యత అన్నట్లుగా ఉంది పరిస్థితి. పైగా అసలు స్థానాలు మారిస్తే
వీరిరువురూ కూడా పోటీకి దూరంగా ఉండడం.. లేదంటే రాజీనామాలకు సిద్ధమని
చెబుతున్నారు. పిఠాపురం నుంచి దొరబాబును కాదని కాకినాడ ఎంపీ వంగా గీతను
పోటీకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఈసారి దొరబాబుకు టికెట్ కష్టమే అంటున్నారు.
ఈ నేపథ్యంలో దొరబాబు వర్గం అసంతృప్తితో ఉండగా ఈయన ఎలాంటి నిర్ణయం
తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పోలవరం
ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు తాడేపల్లిలో జగన్ తో
సమావేశం కాగా బుజ్జగింపులు చేశారు. కానీ అవేమీ ఫలించలేదని పార్టీ వర్గాల
ద్వారా తెలుస్తోంది.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కాకినాడ
ఎంపీగా, జనసేన నుండి గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక
వర ప్రసాద్ ని అమలాపురం ఎంపీగా పంపాలని చూస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి
జిల్లాలో ఆచంట, ఉండి, నరసాపురం, భీమవరం, ఏలూరు, చింతలపూడి, పోలవరం, కొవ్వూరు,
గోపాలపురం తదితర నియోజకవర్గాలలో మార్పులు చేస్తున్నారు. క్రిస్టమస్ తర్వాత ఈ
మార్పులపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తున్నది.. ఆ తర్వాత గోదావరి
జిల్లాలలో వైసీపీ లో ఏం జరుగుతుంది? పరిస్థితి ఎలా మారుతుంది అన్నది ఆసక్తిగా
మారింది. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తంగా ఐదుగురు నేతలు తిరుగుబాటు జెండా
ఎగవేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఉభయగోదావరి
జిల్లాల్లో వైసీపీ దారి గోదారే అవుతుందని అంటున్నారు.