ఆయనే లక్ష్యంగా దూసుకొస్తోందా? అప్పుడు అన్న గెలుపు కోసం చెమటోడ్చిన
చెల్లెమ్మ ఇప్పుడు ఆ అన్న ఓటమి కోసమే కంకణం కట్టుకున్నారా? అంటే రాజకీయవర్గాల
నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా అవుననే సమాధానం
వస్తోంది. అయితే ఎవరిలోనూ పాపం జగన్ అన్న సానుభూతి కనిపించడం లేకపోగా, హమ్మయ్య
ఇప్పటికైనా వాస్తవం గ్రహించి సరైన దిశలో అడుగులు వేస్తున్నారంటూ షర్మిలకు
మద్దతు కనిపిస్తోంది.
ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో
ఉండగా ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు ఇలా మళ్ళీ
ఎన్నికలు వచ్చే సమయానికి అదే షర్మిల గాఢంగా అదే జగన్ ఓటమిని కోరుకుంటున్నారు.
తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల.. అదే అన్న ముఖ్యమంత్రిగా
ఉండగానే పరాయి రాష్ట్రంలో రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వచ్చింది. జగన్
అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో ఉంటే.. సోదరుడి కోసం
రాష్ట్రవ్యాప్తంగా షర్మిల కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. గొంతు చించుకుని
పార్టీ కోసం ప్రచారం చేశారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్
మారిపోయింది. షర్మిలను రాష్ట్రం నుంచి తెలంగాణకు తరిమేశారు. పోనీ అక్కడ సొంత
కుంపటి పెట్టుకుని తన మానాన తాను వెడుతుంటే అక్కడా అడుగడుగునా అడ్డంకులు
సృష్టించారు. షర్మిల విషయంలో జగన్ ఏరు దాటేదాకా అన్న సమెతలా వ్యవహరించారని
జనం నమ్మారు. ఇప్పుడు వైఎస్ జగన్ వేరు.. వైఎస్ షర్మిల వేరు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో షర్మిల రాజకీయ
ప్రవేశం చేసినా, అక్కడ రాజకీయంగా గుర్తింపు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు.
కానీ, ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి
గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకోగా అందుకు
ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ
జరిగిపోయాయి. కానీ, చివరి నిమిషంలో అది జరగలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి
మద్దతు తెలిపి తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. అలా ఉండటం ద్వారా
జగన్ అనుంగు మిత్రుడైన కేసీఆర్ ఓటమికి పరోక్షంగా సహకరించారు. అప్పుడే షర్మిల
నిర్ణయం ఏపీలో వైసీపీకి ఏ మాత్రం నచ్చలేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న
నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కిపడి ఆమెపై అవాకులు చవాకులు పేలారు. ఆ
ఎన్నికలు అయిపోయాయి. అక్కడ షర్మిల మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయం
సాధించింది. ఇక ఇప్పుడు ఆమె సొంత రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. దీంతో
సహజంగానే ఆమె అడుగులు ఎటువైపు అనే ఆసక్తి మొదలైంది. నిజానికి ఇప్పుడు షర్మిల
రాజకీయ అడుగులు ఏపీలో తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఎందుకంటే ఆమె భవిష్యత్ నిర్ణయాలు
ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొన్నాళ్ళుగా రాజకీయ
వర్గాలలో ప్రచారం జరుగుతున్నట్లు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే.. అన్న
వైసీపీకి తీరని నష్టం తప్పదు. కనీసం నాలుగు ఐదు శాతం ఓటింగ్ షేర్ కాంగ్రెస్
దక్కించుకున్నా వైసీపీకి ఘోర ఓటమే ఎదురవుతుంది. దీంతో వైసీపీలో షర్మిల అంటే
వణుకు మొదలైంది. షర్మిల ఇప్పటికే ఏపీలో రాజకీయ పునఃప్రవేశం కోసం ఏర్పాట్లు
చేసుకున్నారని.. సంక్రాంతి తర్వాత షర్మిల ఏపీలో ప్రత్యక్ష రాజకీయాలలో
చురుకుగా వ్యవహరించనున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలు అలా
ఉండగానే.. షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇచ్చిన
క్రిస్మస్ గిఫ్ట్ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం కలిగించింది. వైసీపీలో అయితే ఇక
తమ పని అయిపోయిందన్న భయాన్ని కలిగించింది. ఈ గిఫ్ట్ ద్వారా షర్మిల తన అన్న
జగన్ కు డేంజర్ బెల్స్ మోగించారని, ఆమె ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం
కాకుండా నేరుగా జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం గూటికే
చేరనున్నారని ఈ గిఫ్ట్ ద్వారా స్పష్టమైన సంకేతాలను పంపారని పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు. తద్వారా జగన్ కు పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి
షర్మిల రెడీ అయిపోయారనీ అంటున్నారు.
షర్మిల తెలుగుదేశం గూటికి చేరడమే కాదు, ఆ పార్టీ అభ్యర్థిగా వచ్చే సార్వత్రిక
ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు
ముద్దాయి, తన మరో సోదరుడు వైఎస్ అవినాష్ కు ప్రత్యర్ధిగా పోటీలోకి
దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపడమే తార్కానంగా పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో షర్మిల కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ ఓటమి
ఖాయమని చెబుతూ కేసీఆర్‌కు ఓ సూట్ కేసు గిఫ్ట్ గా పంపిచారు. అలాగే ఏపీలో
ఎన్నికలు జరగబోతున్న వేళ జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు.
ఇందుకోసమే ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్
కానుకలు పంపించారు. తద్వారా తాను తన అన్న జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీ
అన్న సంకేతాన్ని పంపారు. షర్మిల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడంపై ఇప్పటికే
వైసీపీ నేతల తమకు మాత్రమే చేతనైన భాషలో విమర్శలు ఆరంభించేశారు. షర్మిల తన చర్య
ద్వారా వైసీపీ ఓటమిని ఇప్పటికే ఖరారు చేసేశారని పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు. కనీసం చెల్లి మద్దతు కూడా పొందలేని జగన్ కు జనం మాత్రం
ఎలా మద్దతుగా నిలుస్తారని అంటున్నారు.