లక్ష్మీనారాయణ పార్టీ ప్రభావం ఎవరిపై పడుతుంది
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల దూకుడు
విజయవాడ : ఓ మూడు నెలల పాటు కాక రేపిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. దీంతో
ఇప్పుడు తెలుగు ప్రజల దృష్టి మొత్తం ఏపీ మీదకి మళ్లింది. వచ్చే ఏడాది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఫిబ్రవరిలోనే
నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా
వేస్తున్నారు. అధికార వైసీపీ కూడా అదే చెబుతోంది. దీంతో ఏపీలో అధికార,
ప్రతిపక్షాలు దూకుడు మీదున్నాయి. ఒకవైపు సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా
ఎమ్మెల్యేలను మార్చేస్తూ జంబ్లింగ్ ఆట మొదలు పెట్టి ఎన్నికలకు రెండు నెలల
ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి వారిని జనంలో వుంచాలని స్కెచ్ గీస్తున్నారు.
మరోవైపు జనసేన కూడా కలిసి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం ఇప్పటికే
అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలు పెట్టింది. సంక్రాంతికి ముందు సంక్రాంతి
తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు
కాంగ్రెస్ కూడా కర్ణాటక, తెలంగాణ గెలుపు జోష్ లో ఏపీలో కూడా ఉనికి చాటుకోవాలని
ప్రయత్నాలు చేస్తున్నది. జనవరి తర్వాత కాంగ్రెస్ నేతలు ఏపీలో క్రియాశీలంగా
మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ మాత్రం ఈసారి ఏపీలో పోటీ
చేస్తుందా లేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.
అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీలోఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సీబీఐ
మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ
పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని ప్రకటించారు. ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ
చేసి ప్రజల మధ్యకు వచ్చానని.. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను
అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. సమస్యలు, పరిష్కారాలను
వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో
రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించానని వెల్లడించారు. ఆ విధంగా 2019
ఎన్నికల్లో పోటీ చేశానని, 3 లక్షల మంది వరకు ఓటర్లు మద్దతు పలికారని
వివరించారు. ఆ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ యువతను, రైతులను,
కార్మికులను, మత్స్యకారులను కలిసిన తర్వాత వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆకాంక్షలు
పరిశీలించానని.. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని
స్థాపించిన పార్టీ తనదని.. ఇది పెట్టిన పార్టీ కాదు.. ప్రజల కాంక్షలు,
ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ అని
పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ లక్ష్మీ నారాయణ అంటే నిజాయతీపరుడు అని టాక్ ఉంది. యూత్ లో కూడా
మంచి క్రేజ్ ఉంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన
తీరు ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. నిజానికి లక్ష్మీనారాయణ 2019
ఎన్నికలకు ముందు కూడా పార్టీ పెట్టాలని చూశారు. సీబీఐలో చేస్తున్న ఉన్నత
ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చి రాజకీయాలలోకి వచ్చారు. 2019 ఎన్నికలలో
జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు
వచ్చాయి. ఆ తరువాత జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. కొంతకాలంగా ఆయన
వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది.
కానీ ఆయన మాత్రం తాను విశాఖ నుంచి ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని
చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన సొంత పార్టీయే పెట్టారు. దాంతో ఏపీలో
రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకున్నట్లు అయింది.
లక్ష్మీనారాయణ ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు
సమాచారం. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు ఇలా
పార్టీగా మారిందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ
ప్రభావం ఎవరిపై పడుతుంది? ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
వైసీపీ, తెలుగుదేశం, జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ పార్టీ
వేదికగా నిలుస్తుందని కొందరుఅంటున్నారు. అయితే, లక్ష్మీనారాయణ తన పార్టీ
లక్ష్యాలు, ఎవరెవరు ఇందులో ఉన్నారో స్పష్టత వచ్చిన తరువాత ఆ పార్టీ ఏపీలో
ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే
లక్ష్మీనారాయణ విశాఖ నుండి ఎంపీగా పోటీ చేయడం ఖరారైంది.