ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్న సజ్జల రామాకృష్ణా రెడ్డి
విజయవాడ : ఏపీలో అధికార పార్టీ వైసీపీని జగన్ అభ్యర్థుల మార్పు నిర్ణయం నిండా
ముంచేస్తోందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఒకటీ రెండూ కాదు మొత్తం
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ సిట్టింగుల మార్పు నిర్ణయంతో పార్టీ మునక
ఖాయమేనని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పని తీరు ఆధారంగానే ఈసారి టికెట్లు
కేటాయిస్తామని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరా ఎన్నికలు దగ్గరకి వచ్చాక
వాళ్లూ వీళ్లూ అని లేకుండా అందరినీ మార్చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఎంత మంది
సిట్టింగులు ఉంటూ అంత మందినీ మార్చేయడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి
పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఎలా చెప్తే అలా మంత్రులు,
సిట్టింగులు, సీనియర్లు అని కూడా చూడకుండా మారాల్సిందే అని హుకుం జారీ
చేస్తున్నారు. కొందరికైతే అసలు టికెట్లు కూడా లేవని ముఖం మీదే
చెప్పేస్తున్నారు.
దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తెగించి తిరుగుబాటుకు రెడీ
అయిపోతున్నారు. దీంతో జగన్ ఆదేశం మేరకు సజ్జల రంగంలోకి దిగి వారిని
బుజ్జగించే పని మొదలు పెట్టారు. అయితే ఎమ్మెల్యేలు తగ్గేదేలే అంటూ
భీష్మిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత మార్పులను ప్రకటించిన జగన్ రెండో విడత
మార్పులకు సిద్ధం అయిపోయారు. రెండో జాబితాలో మార్పులు ఎవరెవరు ఎక్కడెక్కడికి
అన్నది ప్రకటిస్తే వైసీపీలో అసమ్మతి విస్ఫోటనం చూడాల్సి వస్తుందని పార్టీ
వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులను వారికి రాజకీయం నేర్పిన
స్థానాల నుండి తరలించడం, మరికొందరు మంత్రులకు అసలు సీట్లే లేవని చెప్తుండడంతో
వీరంతా ఇప్పటికే తిరుగుబాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాల
ద్వారానే తెలుస్తోంది.
ఏపీలో అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే ఈ తిరుగుబాటు
మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలు
ఉన్నాయి. గత ఎన్నికలలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లోక్ సభ స్థానాల
పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు వినా మిగిలిన అన్ని స్థానాలలో వైసీపీ విజయం
సాధించింది. విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు విజయవాడ తూర్పు నుంచి గద్దె
రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచారు.
కాకపోతే వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి మారి పోయారు. 2019 ఎన్నికలలో
వల్లభనేని అతి స్వల్ప ఓట్ల తేడాతో గెలిస్తే వైసీపీ నుండి విజయవాడ సెంట్రల్
పరిధిలో మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక
ప్రస్తుతానికి వస్తే మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా
వైసీపీ నేతలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదనడంలో సందేహం
లేదు. దీనినే కారణంగా చూపుతూ ఎంతటి మహామహులైనా సరే సిట్టింగుల స్థానాలను
మార్చడం ఖాయమని జగన్ చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం అందుకు సుముఖంగా
లేరు. అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో
అభ్యర్థుల మార్పు ఇప్పటికే ఖరారైంది. అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే
సింహాద్రి రమేశ్‌ను తప్పించి మంత్రి అంబటి రాంబాబును తీసుకువస్తారని
చెబుతున్నారు. అంబటికి అవనిగడ్డతో మంచి సంబంధాలు ఉండటంతో మార్పు ఖాయమనే
ప్రచారం జరుగుతోంది. ఇక తిరువూరులో ఎమ్మెల్యే కొక్కిరిగడ్డ రక్షణనిధి స్థానంలో
కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే గత ఎన్నికలలో 25
ఓట్లతో గెలిచిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి నగరంలో
ఉన్న మరో ఎమ్మెల్యేను ఇక్కడ నుంచి రంగంలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీ
శ్రేణులు చెబుబుతన్నాయి. అంతే కాకుండా ఈసారి విష్ణుకు టికెట్ అనుమానమేనని
చెబుతున్నారు.
అలాగే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను విజయవాడ ఎంపీగా పంపి
మైలవరానికి పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్ ను తీసుకువచ్చే
అవకాశాలున్నాయని అంటున్నారు. జోగి రమేష్ కుకి ఇది సొంత నియోజకవర్గం కావడం
కలిసివస్తుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే వసంత ప్రసాద్ మాత్రం
నియోజకవర్గం మారేందుకు ససేమిరా అంటున్నారనీ, అంతగా అయితే పోటీ నుంచి
విరమించుకుంటానని తెగేసి చెప్పినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ఇక
మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ
చేయనని ఇప్పటికే ప్రకటించారు. అయితే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని కండీషన్
పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని
వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేశ్, మంత్రి జోగి రమేశ్ తదితరులు
ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసి చర్చించగా వీరిలో ఎవరిని తప్పిస్తారన్న చర్చ
జరుగుతుంది. వీరిలో కొందరు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారన్న నివేదికలతో వైసీపీ
వీరిని సామరస్యంగా పక్కన పెట్టాలని చూస్తున్నదని అయితే మారిస్తే మాత్రం మాట
వినే ప్రశక్తేలేదని వీరు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. జగన్ పై
తిరుగుబాటుకు ఇక్కడ నుండే బీజం పడే ఛాన్స్ ఉందని పరిశీలకులు
విశ్లేషిస్తున్నారు.