విజయవాడ : విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం అందించిన ట్యాబ్లు, వాటికి అవసరమైన
కంటెంట్ సమకూర్చడంలో రూ.1,250 కోట్ల అవినీతి జరిగిందని సీపీఎం రాష్ట్ర
కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. గతేడాది రూ.9 వేలు విలువ చేసే ఒక్కో
ట్యాబ్ను రూ.13 వేలకు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది రూ.12 వేలు ఉన్న
ట్యాబ్ను రూ.17,500కు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్ల కొనుగోళ్లలో రూ.250
కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ రూ.వెయ్యి కోట్ల పెద్ద కుంభకోణం
జరిగిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ వంటి సంస్థకు ఈ
ట్యాబ్లు, వాటికి కావాల్సిన కంటెంట్ అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం
అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల
భర్తీలోనూ జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు.