అరాచకాలు సృష్టించిన జగన్ను ప్రజలు క్షమించరు
అక్రమ కేసులకు భయపడితే మరణశాసనం రాసుకున్నట్టే
మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరిన
పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం నియోజకవర్గ నేతలు
గుంటూరు : రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ను ప్రజలు క్షమించరని టీడీపీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మన రాతలు తిరగరాసుకునే శక్తి మన
చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాలి, లేదంటే వదిలి
పారిపోయే ఖర్మ ప్రజలకేంటని ప్రశ్నించారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం,
గజపతినగరం నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం
పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా
ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన సినిమా అయిపోయిందని
జగన్కు కూడా అర్థమైందన్నారు. అందుకే వైకాపా నుంచి రాజకీయ వలసలు
ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు జగన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక
ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని ఎద్దేవా చేశారు.
మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనన్న వ్యక్తి ఇప్పుడు మహిళల భర్తలు, బిడ్డలతో
ఏళ్ల తరబడి తాగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ
పారిపోయాయి, ఒక్కరికీ ఉద్యోగం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోనే
రూ.40వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయని, ఆ భూ దందాలన్నీ 22ఏ నిబంధన ఉల్లంఘించే
జరిగాయని ఆరోపించారు. ఓట్ల దొంగలు వచ్చి బతికున్న వారినీ చంపేస్తున్నారని
దుయ్యబట్టారు. పెదకూరపాడు ఎమ్మెల్యే జగన్కు బినామీగా రెండు జిల్లాల్లో ఇసుక
కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. కృష్ణా నదికి అడ్డంగా రోడ్డు వేసిన ఇసుక మాఫియా
వైసీపీదని మండిపడ్డారు. ఒకప్పుడు రొయ్య మాదిరి మీసాలు మెలేసిన ఆక్వా రైతులు
ఇప్పుడు పూర్తిగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల
కోసమే యజ్ఞాలు, హోమాలు పూజలు చేశానని, తన కోసం కాదని స్పష్టం చేశారు. అక్రమ
కేసులకు భయపడితే మరణశాసనం రాసుకున్నట్టే అన్నారు.
మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తాడా? : అక్రమ కేసులకు
భయపడి ప్రజలు బయటకు రాకుంటే, మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్టని
పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని ఆకాంక్షించారు.
తాను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి వాడిని కాదని, ఎక్కడ సమస్యలు ఉంటే తాను అక్కడ
ఉంటానని స్పష్టం చేశారు. 40ఏళ్ల రాజకీయ అనుభవంతో కష్టపడి, ప్రజల కష్టాలు
తీర్చుతానని చెప్పారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు
ప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్ అమలు చేస్తానంటున్నారని విమర్శించారు. ఉచిత
బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా
దోచింది తిరిగి ఇస్తాడా అని నిలదీశారు. రాబోయే మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్
రాజధానిని విశాఖకు మారుస్తాడా? అని ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా
సిగ్గుపడట్లేదని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు
జగన్మోహన్ రెడ్డికి మధ్య అని చెప్పారు. జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ
చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరోధక చర్యలు
లేవని చంద్రబాబు గుర్తుచేశారు.
త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తా : ప్రజలందరూ వీళ్లకు బానిసలుగా ఉండాలి.
లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి! ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నా.
ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టేస్తారా? నాకు అన్యాయం జరిగిందని ఎవరైనా
అంటే వారిపై రౌడీలు వచ్చి పడిపోతారా? ఏ మాత్రం విశ్వసనీతయ లేని వ్యక్తి, ఏ
మాత్రం విలువలు లేని వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి” అంటూ విమర్శనాస్త్రాలు
సంధించారు. పెదకూర పాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు
ఈసారి టికెట్ ఇవ్వడంలేదని, అతడిని మార్చుతున్నారని చంద్రబాబు వెల్లడించారు.
శంకరరావును తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారని, కానీ అతడిని దొంగ ఇసుక వ్యాపారం
చేయమన్నారని వివరించారు. సీఎం చెప్పినట్టే శంకర్రావు చేశాడని, కానీ, శంకర్రావు
వల్ల తనకు చెడ్డపేరు వచ్చిందని, అతడిని మార్చితే తనకు మంచి పేరు వస్తుందని
ఇప్పుడు మరొకరికి టికెట్ ఇస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ
శంకర్రావును మార్చితే పరిస్థితులు మారవని, మార్చాల్సింది ఈ ముఖ్యమంత్రినే అని
చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని, రాబోయే
ఐదేళ్లలో తాము ఏం చేయబోతున్నామో అందరికీ వివరిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట
నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా
ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరారు : ఓటమి ఖాయమని జగన్ కు అర్థమైందని
వ్యాఖ్యానించారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరారని అన్నారు.
తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా
ఉన్నానని, అందరి ఆశీస్సులతో రాష్ట్రానికి, తెలుగుజాతికి మంచి పేరు, గౌరవం
తీసుకువచ్చానే తప్ప, ఎప్పుడూ అపఖ్యాతి తీసుకురాలేదని అన్నారు. ఒక్క చాన్స్
అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని మండిపడ్డారు. ఇలాంటివి
చూస్తుంటే మనసు కలచివేస్తుందని, ఒక్కోసారి రాష్ట్రం పరిస్థితి తలచుకుంటే
రాత్రి నిద్ర కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్ ఇస్తే నాలుగు
సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. చివరికి
దేవుడే దిక్కు అనే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. కానీ, మన రాతను
తిరగరాసే శక్తి మన చేతుల్లోనే ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రస్తుత
ప్రభుత్వ పాలనలో ఒక రైతుకు, ఒక ఆటోడ్రైవర్ కు, ఒక నిరుద్యోగికి, ఒక మహిళకు
ఏమైనా ప్రయోజనం కలిగిందా అని వైసీపీ వాళ్లను అడుగుతున్నానన్నారు. రాష్ట్ర
ప్రజలు బాగుండాలనే తన నివాసంలో యజ్ఞయాగాలు చేశానని చంద్రబాబు వెల్లడించారు.