ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
అమరావతి : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ
అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కలిసి గన్నవరం
విమానాశ్రయానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు
వద్దకు వెళ్లారు. లోకేశ్ కారులోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి
ప్రశాంత్ కిషోర్ వెళ్లటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో
ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రధాన పాత్ర పోషించారు.
చంద్రబాబు – ప్రశాంత్ కిషోర్ భేటీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ
కావడం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. ఇటీవల యువగళం పేరిట రాష్ట్ర
వ్యాప్తంగా పర్యటించిన నారా లోకేశ్, పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ
స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు.
ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. షో టైమ్
కన్సల్టెన్సీ పేరిట ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ రాజకీయ
వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాబిన్ శర్మ టీం
సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి
దారితీసే పరిస్థితులపై ఇప్పటికే ఐ ప్యాక్ టీం జగన్‌కు పలు నివేదికలు పంపినట్లు
తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు విధానాలు, ప్రజావ్యతిరేకతపై
పీకే బృందం పలు నివేదికలు జగన్‌కు అందజేసింది. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై
ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. రాష్ట్రంలో మారిన పరిస్థితులు, ఆయా
వర్గాల్లో వ్యతిరేతపై జగన్‌కు నివేదించింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను,
హెచ్చరికలను సీఎం జగన్ పట్టించుకోలేదనే చర్చ జరుగుతుండగా తాజాగా చంద్రబాబుతో
ప్రశాంత్ కిషోర్ భేటీపై ఉత్కంఠ నెలకొంది.
పార్టీ క్యాడర్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్
కిషోర్ – చంద్రబాబు సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటలపాటు
చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ చర్చించారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు
నివాసం నుంచి గన్నవరం బయలుదేరారు. లోకేశ్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి
వెళ్లారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య కీలక అంశాల ప్రస్తావన వచ్చినట్లు
తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక
ఇచ్చారు. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలు వివరించారు. వైసీపీ
ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పీకే తెలిపారు. వచ్చే
ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలు వివరించారు. నిరుద్యోగం, ధరలు
ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషించారు. విద్యుత్ ఛార్జీలు,
పన్నుల బాదుడు తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. దళితులు, బీసీలపై దాడులు ఆయా
వర్గాలను వైసీపీకి దూరం చేశాయని, ఒకరిద్దరు మినహా మంత్రులకు సున్నా మార్కులని
వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందనే భావన
ప్రజల్లో వచ్చిందన్న పీకే, ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహరచన
ఉండాలని సూచించారు. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీటీపీ కార్యాచరణ
ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో జగన్‌పై వ్యతిరేకత
వచ్చిందని తెలిపినట్లు తెలుస్తోంది