ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా
తిరుపతి : సామాజిక సేవ కార్యక్రమాలతో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)
ఎల్లప్పుడూ ముందుండి తెలుగు రాష్ట్రాలకు తగిన సహకారాన్ని అందిస్తుందని ఆటా
ఎలెక్ట్ అధ్యక్షులు, ఆటా వేడుకల చైర్ జయంత్ చల్లా అన్నారు. శనివారం తిరుపతి
ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయంత్ మాట్లాడుతూ అమెరికన్
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాకు వచ్చే తెలుగు వారికి తగిన సహాయ
సహకారాలు, ఆతిథ్యాన్ని అందించి వారికి అండగా నిలుస్తున్నామన్నారు. 1991లో
ప్రారంభమైన అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటి నుండి నేటి వరకు సేవా
కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందన్నారు. ప్రతిఏటా అమెరికన్ తెలుగు
అసోసియేషన్ ఆధ్వర్యంలో విరివిగా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 10 నుండి 30వ తేదీ వరకు అమెరికన్ తెలుగు
అసోసియేషన్ రెండు టీమ్ లుగా మారి ఈ సేవా కార్యక్రమాలను క్షేత్రస్థాయికి
తీసుకెళ్తున్నామన్నారు. ఆటా సేవా కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని శ్రీశైలం
మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రారంభించామన్నారు. సమీప నల్లమల అడవుల్లోని
చెంచులకు అమెరికా నుండి తీసుకువచ్చిన బట్టలను అందించామన్నారు. సమీప ప్రభుత్వ
పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్లు వంటివి విరాళంగా అందించమన్నారు. కేంద్ర
ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నానికి
ఆటా తనవంతుగా ఎస్వి యూనివర్సిటీ వేదికగా రూస సంయుక్త ఆధ్వర్యంలో స్టార్టర్
కంపెనీలతో ఇన్వెస్టర్ల మీట్ ను ఈ రోజు నిర్వహించామన్నారు. ఆదివారం ఉదయం 7
గంటలకు ఎస్వీయూ రెండవ గేటు నుండి మహతి కళాక్షేత్రం వరకు ఆటా ఆధ్వర్యంలో వాక్
థాన్, వాగ్గేయకారుడు అన్నమయ్య సంకీర్తనలపై సంగీత పోటీలు, సాంస్కృతిక సంబరాలను
మహతి కళాక్షేత్రం వేదికగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు వచ్చిన
దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం
చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగు అసోసియేషన్ కోశాధికారి సతీష్
రెడ్డి, ప్రతినిధులు పరమేష్ భీమిరెడ్డి, కాశీ కొత్త, మీడియా కో ఆర్డినేటర్
ఈశ్వర్ బండ తదితరులు పాల్గొన్నారు.