పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాతమే
కీలకం
ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్
కుమార్ వ్యాస్‌ల నేతృత్వంలోని బృందం
ఎస్ఎస్ఆర్-2024, ఎన్నికల సన్నద్ధతపై విజయవంతంగా ముగిసిన సమీక్ష
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా
విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో నోటిఫికేషన్ వచ్చే
నాటికే 360 డిగ్రీ-సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, దీనివల్ల ఎలాంటి
గందరగోళానికి తావులేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికల
నిర్వహణకు వీలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్
కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్‌ల నేతృత్వంలోని బృందం
జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు; ఎస్పీలకు దిశానిర్దేశం చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2024, సాధారణ
ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన
సమీక్షా సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల
సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ,
నితీష్ కుమార్ వ్యాస్; స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్
సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్
(ఎక్స్పెండిచర్) యశ్వీంధ్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి
ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర,
జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్
అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు
నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ ప్రక్రియ, గుర్తింపు పొందిన
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, వివిధ
ఫారాల పరిష్కారం, ఇంటింటి సర్వే, అనామలీస్, ఫొటో, డెమోగ్రాఫిక్ సిమిలారిటీల
పరిష్కారం, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, డిస్పాచ్, రిసీట్, ట్రైనింగ్
సెంటర్లు, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల
కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా శనివారం ఉదయం
నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు,
తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ జిల్లాల ఎస్ఎస్ఆర్-2024
పురోగతిని, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలను తెలియజేశారు. సమావేశంలో
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ
సంఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ఎన్నికల
నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధత,
నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని.. పారదర్శకత,
జవాబుదారీతనం ముఖ్యమని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం
మార్గదర్శకాలకు అనుగుణంగా చేస్తున్న ఏర్పాట్లతో నిష్ఫక్షపాతం, నైతికత
ప్రస్ఫుటమవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలను కొత్తగానే భావించి
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలన్నారు.
శూన్య దోష ఓటర్ల జాబితాతో పూర్తిస్థాయి ఫలితాలు : ఎన్నికల నిర్వహణలో దోష
రహిత ఓటర్ల జాబితా కీలకమని, ఇలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్లడం వల్ల
వివాద రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం
చేయొచ్చని ఈసీఐ అధికారులు పేర్కొన్నారు. జాబితాలో ఎక్కడా ఒక్క డెత్ కానీ,
డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ జరగాలని స్పష్టం
చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి..
పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ఈవీఎంలతో పాటు ఎన్నికల నిర్వహణకు
అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం
చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని
స్పష్టం చేశారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్,
స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు సంబంధించి
కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా అత్యంత
ముఖ్యమన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందికి
సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో
శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా
ఎన్నికల నిర్వహణలో కీలకంగా నిలుస్తాయన్నారు.
ప్రతి ప్రాంతానికీ ప్రత్యేక స్వీప్ ప్రణాళిక : గత ఎన్నికల్లో
నియోజకవర్గాల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను
విశ్లేషించుకొని.. ఆయా ప్రాంతాలనుబట్టి, కారణాలకు అనుగుణంగా ప్రత్యేక
సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిపిషేన్ (స్వీప్)
కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ
కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. వల్నరబులిటీ
ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, వల్నరబులిటీకి గల కారణాలను
గుర్తించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్
కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోల్
డే మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా భారత ఎన్నికల సంఘం
ప్రతినిధులు మార్గనిర్దేశనం చేశారు.