అమరావతి : యువగళం పాదయాత్రను నవశకం వైపు నడిపించిన అందరికీ టీడీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ
లేఖ విడుదల చేశారు. వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో
కుప్పంలో జనవరి 27న ప్రారంభించి డిసెంబరు 18న విశాఖలో ముగిసే నాటికి మొత్తం
226 రోజుల పాటు ప్రజలందరూ తన వెంట ఉండి నడిపించారన్నారు. పాదయాత్రలో తాను
చూసిన కష్టాలు, ప్రజల సమస్యలను ముందుంచడంలో ప్రముఖపాత్ర వహించిన మీడియాకు
ధన్యవాదాలు తెలిపారు. తనను కంటికి రెప్పలా కనిపెట్టుకుని పాదయాత్రలో సంయమనంతో
విధులు నిర్వర్తించిన యువగళం బృందం, వాలంటీర్లకి అభినందనలు చెప్పారు. తనను
అడ్డుకోవాలని ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడి చేసినా లొంగకుండా యువగళంలో
బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులకు నమస్సులు తెలిపారు. యువగళం
పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు,
అభిమానులు సహా ఈ మహాప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు
చెప్పారు. 97 నియోజకవర్గాల్లో ఏ ఊరు వెళ్లినా, ఏ పట్టణంలో నడిచినా ప్రజలు తనను
తమ వాడిగా ఆశీర్వదించి, ఆదరించారని, వారందరికీ రుణపడి ఉంటానన్నారు. త్వరలో
ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమానికి కృషి
చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని లోకేశ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.