కొన్ని అంశాలపై స్పష్టత కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం
అధ్యయనం చేసి పరిష్కరించేందుకు మూడు నెలల సమయం అవసరం
గ్రాట్యుటీ పెంపు, మినీ సెంటర్ల అప్‌గ్రేడ్, పదోన్నతి కల్పన తదితర
డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం
మానవతా దృక్ఫథంతో స్పందించి తక్షణమే విధుల్లో చేరాలి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు
అంగన్వాడీల సమ్మెపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం : రాష్ట్రంలోని అంగన్వాడీ అక్క, చెల్లెమ్మల డిమాండ్ల
పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మూడు నెలల సమయంలో
అన్నింటికీ పరిష్కారం చూపిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ పేర్కొన్నారు. ఇటీవల మంత్రుల బృందం, అధికారులతో జరిగిన
చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అన్ని అంశాలను నెరవేరుస్తామని హామీ
ఇచ్చారు. వీటిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అక్కడ నుంచి స్పందన
వచ్చిన వెంటనే అధ్యయనం చేసి అక్క, చెల్లెమ్మలు కోరిన మాదిరిగానే
నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత కొన్ని రోజుల నుంచి అంగన్వాడీలు
చేపడుతున్న సమ్మెపై స్పందిస్తూ విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో
గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి సూచించిన పలు అంశాలను
వివరించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 15న మంత్రుల
బృందంతో సహా వివిధ స్థాయిల్లోని యూనియన్ల ప్రతినిధులతో ప్రభుత్వం అనేక చర్చలు
జరిపిందనివెల్లడించారు.
మానవతా దృక్ఫథంతో స్పందించి తక్షణమే విధుల్లో చేరాలి : సేవా ముగింపునకు
ఇచ్చే ప్రయోజన మొత్తాన్ని రూ.50,000 నుంచి 1,00,000 వరకు అంగన్వాడీ
కార్యకర్తకు, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.20 వేల నుంచి 40 వేల వరకు పెంచడం.
అంగన్వాడీ సహాయకులను వర్కర్లుగా పదోన్నతి కల్పించుటకు ప్రస్తుతం ఉన్న 45 సం||ల
వయస్సును 50 సంవత్సరాలకు పెంచడం. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పదవీ విరమణ
వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచడం. సీడీపీవో స్థాయి గల ప్రాజెక్ట్ స్థాయి
అధికారి వద్ద జరిగిన సమావేశాలకు టీఏ, డీఏ బిల్లులను అందించడం. మినీ అంగన్వాడీ
కేంద్రాలను (6837) ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి తగిన అంశాలను పరిశీలించడం.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచేందుకు
పరిశీలన. మెడికల్ లీవ్ మంజూరుకు అధ్యయనం.అంగన్వాడీ వర్కరు, సహాయకులకు
గౌరవ వేతనం పెంపుదల డిమాండ్లపై, ప్రభుత్వం అంగన్వాడీ వర్కరుకు రూ.11,500,
హెల్పర్‌కు రూ.7,000 వరకు 01.07.2019 నుంచి పెంచాం. ప్రభుత్వం 2014 వరకు
అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనంగా రూ.4,200 అందించింది.అది 2016 సంవత్సరంలో
రూ.7,000 కి పెంచడమైనది. 2018లో అదే మొత్తాన్ని రూ.10,500కి పెరిగింది.
సగటున ప్రభుత్వం 2019 వరకు నెలకు రూ.6.590, హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కరు
కోసం రూ.3.900 గౌరవ వేతనం అందిస్తోంది. అయితే, 2019 నుంచి ప్రభుత్వం
వర్కరుకి నెలకు రూ.11,500, హెల్పరుకు రూ.7,000 లకు పెంచిన గౌరవ వేతనాన్ని
చెల్లిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కరు, హెల్పర్లకు గౌరవ వేతనంలో
76%ని తన రాష్ట్ర ఖజానా నుంచి అందజేస్తుంది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక గౌరవ
వేతనం చెల్లించే టాప్ 6 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా, అంగన్వాడీ
హెల్పర్లకు అత్యధికంగా గౌరవ వేతనం చెల్లించే రాష్ట్రంగా 4వ స్థానంలో
నిలిచిందని మంత్రి బొత్స పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీని
అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 నుంచి వర్కర్‌కు రూ.50,000,
హెల్పర్‌కు రూ.20,000 సర్వీస్ ముగింపు ప్రయోజనాన్ని అందిస్తోంది. అంగన్వాడీ
కార్యకర్తలకు సేవా ముగింపు ప్రయోజనాన్ని రూ.1,00,000కు, హెల్పర్లకు
రూ.40,000కు పెంచాలని ప్రభుత్వం పరిశీలనలో నిర్ణయించింది. ప్రభుత్వం 2019
నుంచి అనేక సంక్షేమ చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలను అందించిందని మంత్రి
వివరించారు.
సంక్షేమం రూపంలో రూ.కోట్ల సాయం : నవరత్నాల్లో భాగంగా జగనన్న విద్యా దీవెన,
ఆసరా, రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ మొదలైన పథకాల ద్వారా
అంగన్వాడీ వర్కర్ల కుటుంబాలకు రూ.655 కోట్ల మేర, హెల్పర్ల కుటుంబాలకు
రూ. 758 కోట్ల మేర లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. పర్యవేక్షణను సులభతరం
చేయడానికి గాను రూ.85.47 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు అందించామని,
సంవత్సరానికి రూ.12 కోట్లకు అవసరమైన 4జీబీ, 2జీబీ ఇంటర్నెట్ ఛార్జీలను
ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత రూ.16
కోట్ల వ్యయంతో యూనిఫాం అందించామని పేర్కొన్నారు. అంగన్వాడీల కష్టాలను
తగ్గించడానికి ప్రభుత్వం 2020 నుంచి వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ,
ఆగస్టు 2023 నుంచి టేక్ హోమ్ రేషన్ కిట్లు గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు
పంపిణీ చేస్తున్నామన్నారు. దీని వలన 03-06 సంవత్సరాల మధ్య పిల్లలకు మాత్రమే
వంట చేయడం పరిమితం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పనితీరును
ప్రోత్సహించడానికి ఇప్పటి వరకు రూ.27.80 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
9 సంవత్సరాల విరామం తర్వాత అర్హత కలిగిన వర్కరుని పదోన్నతి ద్వారా గ్రేడ్.2
సూపర్వైజర్ పోస్టులలో నియమించామని తెలిపారు. ఇప్పటి వరకు 560 మంది వర్కర్లు
ప్రయోజనం పొందారన్నారు. వీటితో పాటు చర్చల్లో వచ్చిన అన్ని అంశాలపై
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అక్క, చెల్లెమ్మలు వెంటనే విధుల్లో
చేరి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులకు గురవ్వకుండా వారి
సేవలను అందించాలని, ఎవరి మాయలోనూ, ఉచ్ఛులోనూ పడొద్దన్నారు.