నెల్లిమర్ల : ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న ‘యువగళం-నవశకం’
కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎంపీ
రామ్మోహన్నాయుడు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల
నియోజకవర్గంలోని పోలిపల్లిలో ‘యువగళం-నవశకం’ పేరుతో భారీ బహిరంగ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జనవరి 27న కుప్పంలో
మొదలైన యువగళానికి చిత్తూరు చిందులేసింది. కడప కదిలింది. కర్నూలు కన్నుల
పండువగా మారింది. అనంతపురం ఆత్మీయతను చాటుకుంది. నెల్లూరు నడుం బిగించింది.
ఒంగోలు ఉరకలేసింది. గుంటూరు గర్జించింది. కృష్ణా జిల్లా కృష్ణమ్మలా కరుణ
చూపించింది. గోదావరి గర్జించింది. విశాఖపట్నం విజృంభించింది. విజయనగరం విజయ
పతాకాన్ని ఎగురవేసింది. శ్రీకాకుళం శంఖారావంతో పూనుకుని యావత్ ఉత్తరాంధ్ర
కూడా ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తోంది. యువగళం ముగింపు కాదు. ఇప్పటి
నుంచే ఆరంభమవుతుందన్నారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 100 రోజులు ఓపిక పడితే
టీడీపీ -జనసేన ప్రభుత్వం వస్తుంది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, దళితులు, యువత,
రైతులకు మంచి జరుగుతుంది. పోలవరం పూర్తి చేసుకుందాం, నిరుద్యోగ యువతకు ఉపాధి
అవకాశాలు కల్పిద్దాం. వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని
వదిలించుకోబోతున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ , జనసేన కార్యకర్తల
కేరింతలతో సభా ప్రాంగణం సందడిగా మారింది.