రాష్ట్ర సంఘం బలోపేతానికి కొత్త జిల్లాలతో సహా అన్ని జిల్లాల కమిటీలు పూర్తి
2018 నుండి 2020 వరకు ఇచ్చిన డిఏ ను వెనక్కు తీసుకున్నారు
2018 నుండి అయిదేళ్ళు దాటినా విఆర్ఏ లకు ఒక్కరూపాయికూడా జీతాలు పెంచలేదు
11 వ పిఆర్సీ కూడా అమలు చేయలేదు
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : అయిదేళ్ళు దాటినా విఆర్ఏల జీతాలు పెంచలేదని, సీఎం అంగీకరించినా
విఆర్ఏల డిఏ పై నేటికీ ఉత్వర్వులు విడుదలకు నోచుకోలేదని ఏపిజెఏసి అమరావతి
స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 2018 నుండి నిలుపుదల చేసిన
డిఏను రూ. 300 నుండి రూ.500 పెంచి ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి
అంగీకరించారని విఆర్ఏ అసోషియేషన్ సీఎంని కలసి ధన్యవాదాలు చెప్పి నాలుగు
నెలలయినా ఉత్వర్వులు విడుదల కాలేదన్నారు. మంగళవారం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద
ఉన్న రెవిన్యూభవన్ లో ఆంధ్రప్రధేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (ఏపీ విఆర్ఏ
అసోషియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి
బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర సంఘం బలోపేతానికి కొత్త జిల్లాలతో
కలిపి 26 జిల్లాలకు గాను, 20 జిల్లాల నూతన కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఈ
సమావేశానికి హాజరయ్యారు. త్వరలో మిగిలిన 6 జిల్లాలకు కూడా 2024 జనవరి – 20
తేదీ లోపు నూతన కమిటీలు పూర్తి చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 27వేల మంది విఆర్ఏ లను గ్రామ
స్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాలు వారి గ్రామ స్థాయి అవసరాలకు
ఉపయోగించుకుంటారని, వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు మాత్రం
ప్రభుత్వం ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. వీళ్లకు ప్రభుత్వం
చెల్లించే జీతాలు చాలా తక్కువన్నారు. దానికి తోడు కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్న
డిఏ ను 2018 నుండి జీతం పెంచమనే నెపంతో గత ప్రభుత్వం నిలిపి వేస్తే ఈ
విషయాన్నిఈ ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించామన్నారు. ప్రభుత్వం
ఇస్తున్న డిఏ ని 2018 నుండి 2020 వరకు చెల్లించిన డి ఏను ప్రతి నెలా వారి
జీతాల నుంచి సుమారు 14 కోట్లు రికవరీ చేశారని, జీతం పెంచరనే నెపంతో
దశాబ్దాలుగా ఇస్తున్నది నిలిపి వేయడమే కాకుండా ఇచ్చిన డిఏ ను తిరిగి ప్రభుత్వం
తీసుకోవడం చాలా బాధాకరమని బొప్పరాజు ఆవేదన వ్యక్తంచేశారు. జరిగిన అన్యాయంపై
ఏపి రెవిన్యూ సర్వీసెస్ అసోషియేషన్, ఏపిజేఏసి అమరావతి ఆధ్వర్యంలో జరిగిన 92
రోజుల ఉద్యమంలో విఆర్ఏ సోదరులకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి
దృష్టికి,చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు
వెళ్లడంతో ప్రభుత్వం స్పందించి 300 లకు బదులు 500కు పెంచేలా ముఖ్యమంత్రి
ఆమోదం తెలిపారని అందరూ గ్రామ రెవెన్యూ సహాయకులు సంతోషించారన్నారు. నెలలు
గడుస్తున్నాయే తప్ప నేటికీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం
రూ. 500కు పెంచిన డి ఏ ఉత్తర్వులు జారీ చేయాలని, కనీసం కొత్త సంవత్సరం జనవరి
ఒకటో తేదీ నుంచి నగదు రూపంలో చెల్లించాలని, రికవరీ చేసిన డబ్బులు తిరిగి వి
ఆర్ ఏ లకు చెల్లించాలని కోరారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 11 వ పిఆర్శీ సిఫారసుల మేరకు, అందరూ ఉద్యోగులకు
23% శాతం జీతాలు పెంచినా సరే, ఈ విఆర్ఏ లకు మాత్రం అయిదు సంవత్సరాల పైబడి ఒక్క
రూపాయికూడా జీతాలు పెంచలేదని బొప్పరాజు తెలిపారు. కావున, తక్షణమే ప్రభుత్వం
గ్రామ రెవెన్యూ సహాయకులు జీతాలు పెంచాలని కోరారు. ఈసమావేశంలో విఆర్ఏ
అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఇస్తున్న డిఏ
నిలుపుదల చేసి డిఏ చెల్లింపులు కొనసాగించాలని చేసిన విజ్ఞప్తులు, ఏపీ జేఏసీ
అమరావతి పోరాటాలు మేరకు రికవరిని స్వయంగా ముఖ్యమంత్రి డిఏ రూ. 500 కు పెంచుతూ
అంగీకరించడతో స్వయంగా అసోసియేషన్ తరపున వెళ్లి డిఏ పెంచి చెల్లింపులకు
అంగీకరించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్ఫి నాలుగు నెలలు గడుస్తున్నా సరే
ఇంకా ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఉన్న విఆర్ఎ లు అంతా
ఆందోళన చెందుతున్నారన్నారు. వీరి ఆందోళన తీవ్రతరం కాకముందే పెంచిన డిఏ కి
సంబంధించిన ఉత్వర్వులు తక్షణమే విడుదల చేయాలని గరికపాటి బ్రహ్మయ్య డిమాండ్
చేశారు.
ఏపీ విఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలుకొండ రాంబాబు
మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ వి ఆర్ ఏ ల సంఘానికి
ఇప్పటివరకు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు గా ఉన్న ఏలూరు కు చెందిన పోలుకొండ
రాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో
ఏపిజెఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదరవావు, ఏపీ
జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ పారె లక్ష్మి, ఏపీ మునిసిపల్
ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్,
విఆర్ఎ అసోసి యేషన్ రాష్ట్ర కోశాధికారి సత్యన్నారాయణ,ఏపి క్లాస్ 4 అసోసియేషన్
రాష్ట్రఅధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు,విఆర్ఓ ల అసోసియేషన్ స్టేట్ అసోసియేట్
చైర్మన్ ఏ.సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి అనుపమ, ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర
ప్రచార కార్యదర్శి బి.కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.