హాజరుకానున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
విజయవాడ : ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024లో భాగంగా జనవరి 5న తుది జాబితా
ప్రచురించనున్న నేపథ్యంలో వివిధ దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు
అనుగుణంగా గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్
జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్
మీనాకి వివరించారు. సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి
సోమవారం ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం – 2024, రాజకీయ పార్టీలు
సమర్పించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, అనోమలిస్, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ
చేయబడిన, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డ్ జనరేషన్, తదితర
అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల
అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని
కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, నగర
పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ
2024 తుది దశ కార్యకలాపాలలో భాగంగా కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు
సంబంధించిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో
పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడలో అన్ని జిల్లాల
కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధ్యక్షతన
జరగనున్న సమీక్షా సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ
నుంచి భారత ఎన్నికల ప్రతినిధుల బృందం కూడా సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో
ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేసేందుకు నోడల్
అధికారిని, సమన్వయకర్తలను నియమించామన్నారు. జిల్లాకు సంబంధించి ప్రత్యేక
సంక్షిప్త సవరణ పురోగతిపై పూర్తీ సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నట్లు ఎన్నికల
అధికారి ముఖేష్ కుమార్ మీనాకి కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. వీసీలో
డీసీపీలు విశాల్ గున్ని, అజిత వేజెండ్ల, ఎన్నికల సెల్ సూపరిండెంటెంట్ సిహెచ్
దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.