విశాఖపట్నం : ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోమని
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.
సోమవారం నారా లోకేష్‌ను విశాఖ ఉక్కు నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా నారా
లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ
ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో
కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించిందని నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో
ముడివడి ఉన్న ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు
భయపడి జగన్మోహన్రెడ్డి నోరు మెదపడం లేదు. కొందరు బడా పారిశ్రామికవేత్తలతో
కుమ్మక్కయితే ఖాళీగా ఉన్న సుమారు 8వేల ఎకరాల భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు
జగన్ వ్యూహరచన చేశాడు. 5కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి
జగన్‌రెడ్డి కమీషన్ల కోసం, ప్లాంట్‌లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో
మా గళాన్ని వినిపిస్తాం. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు
చేపడతాం.విశాఖ ఉక్కు మనుగడకు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కాస్ట్ కటింగ్ వంటి
అంశాలపై దృష్టిసారించి, రాష్ట్రప్రభుత్వం తరపున అవసరమైన సహాయ, సహకారాలను
అందిస్తామని నారా లోకేష్ తెలిపారు.
జగన్ పాలనలో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది : జగన్మోహన్రెడ్డి విధ్వంసక
పాలనలో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ పేర్కొన్నారు. సోమవారం నాడు నారా లోకేష్‌ను కళాసీ సంఘ ప్రతినిధులు
కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో పనుల్లేక వందలాది
మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు
చెందిన 3వేల కోట్ల రూపాయల నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది.
టీడీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు
అందించాం. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఈ పథకాలన్నీ రద్దు చేశాడు. టీడీపీ
అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు, బీమా పథకాల అమలుకు చర్యలు చేపడతామని నారా
లోకేష్ తెలిపారు.
లోకేష్‌ను కలిసిన జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు : కాగా నారా లోకేష్‌ను
జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. గాజువాకలో టీఎన్ఎస్ఎఫ్
ఆధ్వర్యంలో లోకేష్‌కి విద్యార్థులు స్వాగతం పలికారు.