నెల్లూరు : జిల్లా పరిషత్ వేదికగా ఎంపిపి, జడ్పిటిసి సభ్యులు ప్రస్తావించిన
ప్రజా సమస్యలను మరింత చిత్తశుద్దితో పరిష్కరించేలా అధికారులు కృషిచేయాలని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్
సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా
ఇంచార్జి కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, ఎంపిపి, జడ్పిటిసి సభ్యులు అధికారులు
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కాకాణి
గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా
ఇంచార్జి కలెక్టర్ ఆర్. కూర్మనాథ్ లతో కలసి విజయదీపికను ఆవిష్కరించారు.
విద్యా రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద : ఆనం అరుణమ్మ
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన మిచౌంగ్
తుఫాన్ కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి
ఆదేశాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలతో, జిల్లా ప్రత్యేక అధికారులు
హరికిరణ్, చక్రధర్ బాబు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి నాయకత్వంతో జిల్లా
యంత్రాంగం పటిష్టంగా సమర్దవంతంగా పనిచేయడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రతి
ఒక్కరికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె అన్నారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి విద్యా రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టి, సమాజంలో ఉన్న
పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలను
తీసుకురావడం జరిగిదన్నారు. అందులో బాగంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా నా
వంతు కృషితో ఎంపిపి, జడ్పిటిసి సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం 10వ తరగతి
చదువుచున్న విద్యార్ధులు మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని తెలుగు, ఇంగ్లీష్
మీడియంలో విజయదీపికను ప్రచురించి, విద్యార్ధులకు అందచేస్తున్నట్లు ఆమె
తెలిపారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా పశు సంవర్ధక శాఖ, చేనేత మరియు
జౌళి శాఖ, జిల్లా ఖాదీ బోర్డు శాఖ తదితర శాఖలకు సంబంధించిన అజెండా అంశాలపై
ఎంపిపి, జడ్పిటిసి సభ్యులు అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది.
పంచాయతీ రాజ్ శాఖలో బిల్స్ పెండింగ్లో వున్న అంశాన్ని మర్రిపాడు జడ్పిటిసి
సభ్యులు ప్రస్తావించగా, సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్
స్థాయిలోనే బిల్స్ సిద్దం చేయాలని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి, పంచాయతీ
రాజ్ ఎస్.ఈ ని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని
మర్రిపాడు జడ్పిటిసి సభ్యులు ప్రస్తావించగా, తమ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక రేషనలైజేషన్ చేసి అన్నీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి సర్దుబాటు
చేశామన్నారు. వాకాడు మండలంలో తుఫాన్ వలన నష్టపోయిన వారందరికీ నిత్యావసరాలు,
ప్రభుత్వ సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వాకాడు జడ్పిటిసి సభ్యులు
మంత్రి దృష్టికి తీసుకురాగా, అర్హులైన అందరికి తుఫాన్ నష్ట పరిహారం అందేలా
తిరుపతి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా
పలువురు సభ్యులు తమ మండలాల్లో నెలకొని వున్న సమస్యలను సమావేశం దృష్టికి
తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ వేదికగా ఎంపిపి,
జడ్పిటిసి సభ్యులు తీసుకొచ్చిన ప్రజా సమస్యలను మరింత చిత్తశుద్దితో
పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన
అంశాలను, సమస్యలను సంబంధిత శాఖల అధికారులు నోట్ చేసుకోవడం, వాటికి సమాధానాలు
ఇవ్వడం, అలాగే ఆ సమస్యల పరిష్కారానికి ఏ ఏ చర్యలు తీసుకున్నారో సభ్యులకు
తెలియచేయడం కచ్చితంగా జరగాలన్నారు. ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాన్ సమయంలో
ముందస్తు చర్యలు తీసుకోవడంలోగాని, సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లా
యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయడంతో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, ఈ
సందర్భంగా జిల్లా యంత్రాంగానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరింత సమర్ధవంతంగా నిద్రాహారాలు మాని
కష్టపడి పనిచేసి 5 రోజుల లోపు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పునరుద్దరణకు కృషి
చేయడం జరిగిందని, ఆ శాఖ క్రింది స్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి అన్నారు. జిల్లాలో
అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జిల్లాలో
దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మత్తులు చేపట్టి పూర్తిచేసే పరిస్థితిలో
ఉందన్నారు. 10వ తరగతి విద్యార్దుల కొరకు ముద్రించిన విజయ దీపిక మెటీరియల్ ను
ప్రారంభించుకోవడం సంతోషకరమని, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన
కాలంలో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం జిల్లా పరిషత్ చైర్ పర్సన్
ఆనం అరుణమ్మ గారికి హృదయ పూర్వక ధన్యావాదాలు తెలుపుతున్నట్లు మంత్రి
పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జీ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా పరిషత్
సిఇఓ చిరంజీవి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా పరిషత్
సిఈఓ చిరంజీవి, డిఎఫ్ఓ చంద్రశేఖర రావు, డిఆర్డిఏ, డ్వామా, హౌసింగ్, ఎపిఎంఐపి
పీడీ లు సాంబశివా రెడ్డి, వెంకట్రావు, నాగరాజు, శ్రీనివాసులు, జిల్లా వైద్య
ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని, పశు
సంవర్ధక శాఖ జేడి మహేశ్వరుడు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పిడి హేన సుజన, డిపిఓ
సుస్మిత, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సత్య వాణి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి., ఆర్
డబ్ల్యూఎస్., ఎపిఎస్పిడిసిఎల్ ఎస్ఈ లు కృష్ణమోహన్, గంగాధర్, రంగవర ప్రసాద్,
జిల్లా జౌళిశాఖ ఎడి ఆనంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.