విజేతలకు బహుమతి ప్రదానం చేసిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
పంజాబ్, దిల్లీ, చంఢీఘర్, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జట్లు గెలుపు
విజయవాడ : విద్యార్థుల్లో పోటీతత్వమే కాకుండా ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి ఆటలు పనికొస్తాయని, చదువులో ఆటలను అంతర్భాగం చేసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 12 నుంచి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భాగంగా అండర్ – 19 జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆంధ్రప్రదేశ్ వేదికగా ‘విజయవాడలోని పటమట సీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియం’లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎస్పీడీ గారు మాట్లాడుతూ పాఠశాల విద్యశాఖ, సమగ్ర శిక్ష ద్వారా క్రీడలకు చక్కని ప్రోత్సహమిస్తున్నామని, పాఠశాలలకు క్రీడా సామగ్రి పంపిణీ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, తద్వారా మేధో సంపత్తి పెంపొందించుకోవచ్చని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విజేతలైన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని కోరారు.అనంతరం టీం ఛాంపియన్ షిప్ లో భాగంగా విజేతలకు ట్రోఫీ, పతకాలతో సత్కరించారు. ఈ పోటీలు 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు, రాష్ట్ర గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు, జాతీయ స్థాయి పరిశీలకులు రాజు రాణా, ఎన్టీఆర్ జిల్లా అండర్ – 19 కార్యదర్శి రవికాంత్, ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్ సూర్య చరిష్మా తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే: టీం ఛాంపియన్ షిప్ లో భాగంగా బాలికల విభాగం నుంచి పంజాబ్ ప్రథమ స్థానం, రెండో స్థానం దిల్లీ, మూడో స్థానంలో ఛండీఘర్ కైవసం చేసుకున్నారు. బాలుర విభాగం నుంచి కేరళ మొదటి స్థానం, చండీఘర్ రెండో స్థానం, మూడో స్థానం మహారాష్ట్ర నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ బాలుర, బాలికల విభాగాలు నాలుగో స్థానం దక్కించుకున్నాయి.