అమరావతి : అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నిర్మించిన “గుడుంబా శంకర్’ సినిమా రీ-రిలీజ్ ద్వారా సమకూరిన రూ.35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి చెక్ రూపంలో ఈ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో రీ రిలీజ్ అయ్యే సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో సింహ భాగం జనసేన పార్టీకి మద్దతుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ సమయంలో రూ. 1.05 కోట్లు, జల్సా సినిమాకు రీ- రిలీజ్ సమయంలో కోటి రూపాయలు పార్టీకి అందించాం. ఇప్పుడు గుడుంబా శంకర్ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో సింహభాగం రూ. 35 లక్షలు పార్టీకి మద్దతుగా అందజేశాం. అంజనా ప్రొడక్షన్ లో నిర్మాణమై రీ రిలీజ్ అవుతున్న సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం జనసేన పార్టీకి అందించాలని గతంలో నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మనోహర్ ని కలిసి రూ. 35 లక్షలు చెక్ అందించాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడుతుందన్నారు.