హైదరాబాద్: సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వం తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతం. అలాంటి వ్యక్తి అంతరంగాన్ని అన్వేషించి ఆ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకువస్తే అదే ‘డీకోడింగ్ ద లీడర్’. డాక్టర్ పెద్ది రామారావు రచించిన ఈ పుస్తకం డిసెంబర్ 16న ఆవిష్కరించనున్నారు. శిల్పాకళా వేదికలో ఈ పుస్తకావిష్కరణ సభ జరగనుంది. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఏళ్ల పాటు దగ్గరగా చూసిన పెద్ది రామారావు.. ఆయన గురించి అనేక అంశాలను పాఠకులకు చెప్పాలనుకుని చేసిన ప్రయత్నమే ఈ ‘డీ కోడింగ్ ద లీడర్’. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా మార్చాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యలు.. వాటిని తన సమర్థ నాయకత్వంతో ఎలా పరిష్కరించారో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కియా మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తపన పడిన వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించారు? అనే అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పిల్లలు చదువుకుని ఎదిగి ప్రపంచ నలుమూలలా తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరేస్తే ఆయన సంబరపడేవారని రచయిత పేర్కొన్నారు. అంతేకాదు అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా నిలపాలని చంద్రబాబు కలలు కనేవారని, ప్రధాని వచ్చినా, ప్రపంచ దేశాధినేతలు వచ్చినా అరకు కాఫీ ఇచ్చి అబ్బురపరిచేవారని రచయిత తన పుస్తకంలో పేర్కొన్నారు. లక్షల ఎకరాల్లో కాఫీ పండాలని, ప్రపంచమంతా అరకు వైపు చూడాలని, పేదరికంలో ఉన్న గిరిజనులకు మంచి ఉపాధి అవకాశాలు రావాలని ఆయన కన్నకల సాకారమైందా? లేక అధికార మార్పిడితో గంజాయి వనంగా మారిందా? అనేది ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఇలాంటి ఎన్నో విశేషాల సమాహారమే ‘డీకోడింగ్ ద లీడర్’.