తణుకు : రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమం అందివ్వాలన్న గొప్ప సంకల్పం కలిగిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారులు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. గురువారం తణుకు పట్టణంలో రోటరీ క్లబ్ ప్రాంగణంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మంత్రి ఎగరవేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన డిస్ ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల ఎకరాలను కొనుగోలు చేసి 32 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు అందించారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వాలంటీర్లు ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.
పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అమలు చేస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో కోర్టులకెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయండంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీ కుటుంబానికి అండగా నిలిచి ఒక సభ్యుడుగా మారిపోయారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయంలోనూ ఒక వైపు కరోనా కారణంగా బాదితులకు వైద్యం అందిస్తూనే మరోవైపు ప్రజల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ద్వారా రాష్ర్టంలో పేదరిక స్థాయి 12నుచి 6 శాతానికి, పారిశ్రామికంగా 18 శాతానికి, వ్యవసాయంలో 3 నుంచి 12 శాతానికి, విద్యారంగంలో 15వ స్థానం నుంచి 3వ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్న బడ్జెట్లోనే అప్పుడు లేని సంక్షేమ పథకాలు ఎన్నింటినో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు.
వాలంటీర్లు డేటా చోరీ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి డేటా సేకరిస్తున్నారని, వారు ఎందుకు సేకరిస్తున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. అసలు డేటా చోరీ చేప్పట్టిందే టీడీపీ అన్నారు. రాష్ట్రంలోనే కాదు తణుకు నియోజకవర్గం లో ఎక్కడ ఎవరు డేటా వివరాలు అడిగినా పోలీసులకు గానీ తనకు గానీ సమాచారం అందించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందనీ లేకపోతే మరలా ప్రజా ధనాన్ని దోచుకునే పాలకులు వస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణ వేణి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మంగెన సూర్య, పట్టణ సచివాలయ కన్వీనర్ ఇండుగపల్లి బలరామ కృష్ణ, జిల్లా డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు సుందరరామరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గృహ సారధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.