గ్రూప్-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి
సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ
అనకాపల్లి జిల్లా యలమంచిలి : కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే వైసీపీ కుట్ర అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా హామీలిచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు. పేదవాళ్లకూ వైసీపీ దోపిడీదారులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అడ్డగోలుగా దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇసుక, మద్యం ఇలా ప్రతి దాంట్లో దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.
గ్రూప్-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి : గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నోటిఫికేషన్ల పేరుతో మరోసారి వంచనకు సిద్ధమయ్యారని లోకేశ్ విమర్శించారు.
యలమంచిలిలో లోకేష్‌కు వినతిపత్రం సమర్పించిన ప్రజలు : యలమంచిలి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్‌కు ప్రజలు వినతిపత్రం సమర్పిస్తున్నారు. 8 శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం వలన ఇబ్బందులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు. అలాగే పాదయాత్రలో లోకేష్‌ను న్యాయవాదులు కలిశారు. తమ ఎదుర్కుంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా లోకేష్‌కు అందజేశారు. కొత్తపాలెం సమీపంలో ఇటీవల తుఫానుకు దెబ్బతిన్న వరి పంటను లోకేష్ పరిశీలించారు.