గుంటూరు : ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారేమోనని వైకాపాలోని అసంతృప్త నేతలంతా చూస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీ తోనూ చాలా మంది టచ్‌లో ఉన్నారని చెప్పారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ లో ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని, వారి ఆకృత్యాలను వేరే నియోజకవర్గం భరించాలా? అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. ఉద్యోగుల మాదిరిగా ఇష్టారీతిన నేతలను బదిలీ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇన్‌ఛార్జ్‌ల మార్పుతో వైకాపా ఓటమిని జగన్ ముందే అంగీకరించారని నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఎన్ని మార్పులు చేసినా ప్రజాగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని చెప్పారు. ఐప్యాక్, వాలంటీర్లతో నడిచే స్ట్రక్చర్ వైసీపీదని, కార్యకర్తల బలం, ప్రజాదరణతో నడిచే పార్టీ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో జగన్ షాడో ఎమ్మెల్యేలదే పెత్తనమని నక్కా ఆనందబాబు ఆరోపించారు.