నన్ను దెబ్బ కొట్టాలని కుప్పం ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన కుప్పం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు
అమరావతి : కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నన్ను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగు దేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని, అరెస్టులు చేసి జైలుకు పంపారని చంద్రబాబు అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక బెదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని, వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ప్రశాంతమైన కుప్పంలో వికృత రాజకీయాలతో ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తన పర్యటనకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలపైనా కేసులు పెట్టి వేధించారని, 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. తన అక్రమ అరెస్టు సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజవకర్గం నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలకు దిగినవారిపైనా తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబు నాయుడుకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని కుప్పం నేతలు చంద్రబాబుకు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చ : దాదాపు మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అధినేతకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పని చేయాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాగా ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వేరే కేసులో ఉన్నారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు విన్న న్యాయస్థానం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.