విజయవాడ : లోక్ సభలో అగంతకులు గ్యాస్ బాంబులు వదిలి భయానక వాతావరణం సృష్టించటంపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లోక్ సభలో భద్రతా వైఫల్యం వెలుగు చూస్తోంది. ఈరోజు లోక్ సభలో ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్‌తో చొరబడి భీతావాహం సృష్టించటం విచారకరం. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన అగంతకులు టియర్ గ్యాస్ వదిలారు. ఆగంతకులను భద్రతా సిబ్బంది పట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక దుండగుడైన సాగర్ శర్మను లోక్ సభ గ్యాలరీలోకి అనుమతిస్తూ బిజెపి ఎంపీ ప్రతాప్ సింహ పాస్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పార్లమెంట్ భద్రత వైఫల్యానికి తార్కాణాలు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.