విజయవాడ : ఈనెల 29న మహా బలిపురంలో నిర్వహించ ప్రతి పాదించిన 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశ సన్నాహక అంశాలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గత సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న చర్యలు,ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా, రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు, ఆయుష్మాన్ భారత్, తెలంగాణా నుండి రాష్టానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన వివిధ టాక్సీ రాయితీలు,అదే విధంగా పరిశ్రమలకు రావాల్సిన రాయితీలు, ఢిల్లీ లోని ఎపి భవన్ విభజనకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర విభజన తదుపరి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో ఎస్ఆర్సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమ చంద్రారెడ్డి,ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమీషనర్ కో ఆపరేషన్ బాబు ఏ,టిఆర్అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న, సర్వీస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ఎస్ఇబి డైరెక్టర్ రవి ప్రకాష్, స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ దివాన్ మైదీన్, జెడి అండ్ పిఆర్ పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ గా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన యం.టి. కృష్ణబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.