నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, బిసిల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్ అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించిన బిసి సోదరులను దారుణంగా హతమార్చారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీల్లోని కులవృత్తుల వారి ప్రయోజనాలు దెబ్బతీశాడు. గత టీడీపీ పాలనలో రూ.964కోట్లతో ఆదరణ పథకం ద్వారా 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందించాం. మేం అధికారంలోకి వచ్చాక గొర్రెల యూనిట్లను సబ్సిడీపై అందిస్తామని హామీ ఇచ్చారు.
నారా లోకేష్ ను కలిసిన మహిళలు : పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల గ్రామంలో నియోజకవర్గ మహిళలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం చెప్పే దిశచట్టంతో ఎవరికీ న్యాయం జరగడం లేదు. మహిళలు ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకురావాలి. మహిళల స్వయం ఉపాథికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి, సబ్సిడీ రుణాలు ఇప్పించాలి. మా ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి. అర్హులైన వారందరికీ పెండ్లికానుక, ఒంటరి మహిళల పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళల భద్రత గాలిలో దీపంలా తయారైంది. లేని దిశాచట్టం పేరుతో మహిళలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తోంది. పట్టపగలే మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈశాన్యరాష్ట్రాల తరహాలో మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. మహిళల కష్టాలు తీర్చడానికి మహాశక్తి పథకాన్ని అమలుచేస్తాం. ప్రతిమహిళకు నెలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.2500 రూపాయల సాయంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తాం. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాం. ఎటువంటి కొర్రీలు లేకుండా పెండ్లికానుక, ఒంటరి మహిళల పెన్షన్లు అందచేస్తామని హామీ ఇచ్చారు.
నారా లోకేష్ ను కలిసిన ఉద్దండపురం గ్రామస్తులు : పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఉద్దండపురం గ్రామంలో 3 మండలాల దాహార్తిని తీర్చేందుకు సీపీడబ్ల్యూఎస్ ఫేస్-4 ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం రూ.51కోట్లు అంచనా వేసి నిధులు మంజూరు చేసి శంఖుస్థాపన చేశారు. 75శాతం పనులు పూర్తయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులను పూర్తిచేయకుండా నిలిపేశారు. దీనివల్ల 80 గ్రామాలకు తాగునీరు అందడం లేదు. కలుషితమైన నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్దండపురం రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేసి, మా 80గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ స్పందిస్తూ తమను ఎన్నుకున్న ప్రజలకు కనీసం తాగునీరు అందించిన దివాలాకోరు సిఎం జగన్ అని విమర్శించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిస్తే, వాటిని ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు. టిడిపి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటకీ కుళాయిల ద్వారా 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తామని, ఉద్దండపురం రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేసి 80గ్రామాల దాహర్తి తీరుస్తామని హామీ ఇచ్చారు.