రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా : పవన్ కల్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్
నియంత పాలనకు చరమగీతం పాడుదామని ప్రజలకు పిలుపు
ఈ మేరకు వైఏపీహేట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్
విశాఖపట్నం : నగరంలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్‌తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. దీంతో వీఐపీ రోడ్డులో భారీగా పోలీసులను మోహరించి మూర్తియాదవ్‌తో పాటు, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లి స్థానిక వినాయక ఆలయం నుంచి మలుపు తిరిగి రావాల్సి వస్తోంది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం దృష్ట్యా రోడ్డు మధ్యలో వేసిన సిమెంట్ స్టాపర్స్‌ను తొలగించాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. దీంతో నేడు జనసైనికులు, వీర మహిళలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. స్టాపర్స్‌ను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈ ధర్నాలో పాల్గొన్న నిరసనకారులను అరెస్టు చేసి మూడో పట్టణ ఠాణాకు తరలించారు.
విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మనోహర్ అరెస్టు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ‘‘వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుంది. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుంది. ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు మిగిలి ఉందని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా టైకూన్ జంక్షన్లో వాహనదారులు నానా ఆవస్థలు పడుతున్నారని, ఎంపీ తనకు అనుకూలంగా జంక్షన్ మధ్యలో బార్కెట్లు వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇది వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం కాదా? అని నిలదీశారు. ఎంపీ సత్యనారాయణ లేఖ రాసినా పోలీసులు ఎందుకు బార్కెట్లు తొలగించడం లేదన్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నారన్నారు. ఈ విషయమై పలు మార్లు కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామని, అయినా పట్టనట్లు వున్నారని నాదేండ్ల మనోహర్ అన్నారు. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుదామని పిలిపిస్తే తమను హోటల్ నుంచి బయటకు వెళ్ళనివ్వకపోవడం ఏంటన్నారు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్‌కు తమ కార్పొరేటర్లు హాజరుకావాల్సి వుందని, వారిని కూడా అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. మరో మూడు నెలలే ఉందని, ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా : పవన్ కల్యాణ్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఆయన అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. విశాఖలోని టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. నాదెండ్లతో పాటు అరెస్టు చేసిన మిగతా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే విశాఖ వస్తా..పోరాడుతానని హెచ్చరించారు. ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందనే రోడ్డు మూసేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతల అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.