పంచాయతీ నిధుల మళ్లింపుపై కాగ్ నివేదికను బయటపెట్టాలి
రైతులను నిండా ముంచిన వైసీపీ సర్కారు
తుపాను బాధిత రైతులకు తక్షణ పరిహారం అందజేయాలి
తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్దాం
శ్రీకాకుళంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
శ్రీకాకుళం : ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసి, సీఎం కుటుంబంతో బంధుత్వం కలిగిన ఓ మాజీ మంత్రి ప్రజా వేదికపై బహిరంగంగా తాను మంత్రి పదవిలో ఉన్నపుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం వైసీపీ పాలనలో జరుగుతున్న అసలు తంతును బయటపెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన ఇప్పటికైనా ప్రజల ముందు బహిరంగంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నందుకు అభినందించాలి. ఆయనే కాదు. ముఖ్యమంత్రి కూడా ప్రజల ముందు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మేం మొదటి నుంచి చెబుతున్నట్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సాక్షాత్తూ మాజీ మంత్రులు సంకోచం లేకుండా చెబుతున్నారంటే పాలన ఎలా సాగుతుందో ప్రజలు అర్ధం చేసుకోవచ్చ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం శ్రీకాకుళంలో జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘ప్రతి శాఖలోనూ అవినీతి ఆకాశమంత పెరిగిపోయింది. తవ్వే కొద్దీ అవినీతి జాడలు బయటపడుతున్నాయి. పాలన అస్తవ్యస్తం చేసి, ఇష్టారీతిన వైసీపీ పాలకులు దాష్టీకాలకు పాల్పడుతున్నారు. ఓ మాజీ మంత్రి తాను పదవిలో ఉన్నపుడు అవినీతికి పాల్పడినట్లు చెబుతున్నారంటే ప్రజా ధనం ఎంత దుర్వినియోగం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. వనరుల దోపిడీని ఏ స్థాయిలో జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చన్నారు.
పాల వెల్లువ కాదు… పాపాల వెల్లువ : శ్రీకాకుళం జిల్లాకి చెందిన మంత్రి చూస్తున్న పశు సంవర్థక శాఖలో అవినీతి మరో ఎత్తు. 3 లక్షలకు పైగా పాడి పశువులు కొన్నట్లు చూపారు. వాస్తవానికి కొన్నవి 8 వేలు మాత్రమే. లక్షల పశువులు అంటూ వేల కోట్ల నిధులు బ్యాంకులు నుంచి తీసుకొని ఏం చేశారో చెప్పాలి. పంచాయతీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. గ్రామ సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం అని కాగ్ తేల్చింది. రూ.3,200 కోట్లు పంచాయతీ నిధులు మళ్లించారు. కాగ్ తనిఖీల్లో తేలింది. కాగ్ నివేదికను బయటకు రాకుండా తొక్కిపెట్టారన్నారు.
గట్టు దిగని వారికి రైతుల బాధలెలా తెలుస్తాయి : తుపాను ప్రభావంతో ఖరీఫ్ పంట తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి పంట వచ్చే సమయంలో తుపాను విరుచుకుపడిన వేళ అన్నదాతకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కనీసం వారిని పలకరించిన పాపాన పోలేదు. నష్టపోయిన పంటను పొలం గట్టు వరకు దిగి పరిశీలించలేదు. పంట పొలాల దగ్గర వేదికలను ఏర్పాటు చేసుకొని పంటను పరిశీలిస్తే ఏం తెలుస్తుంది..? రైతన్న గుండె బాధ ఎలా అర్ధం అవుతుంది. పంటల బీమాను పూర్తిగా నాశనం చేసి, ఆపత్కాలంలో రైతుకు మొండి చేయి చూపించిన ఈ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా మోసం చేసింది. పరిహారం విషయంలోనూ మాయ మాటలు చెబుతున్నారు. తుపాను నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి, వెంటనే వారికి కనీసం రూ.20 వేల సాయం అందించాలి. కౌలు రైతులు బాగా దెబ్బతిన్నారు. వారికి కూడా తగిన సాయం చేయాలి. చివరి దశలో ఉన్న పంట నష్టపోవడం ఎంతో విచారకరం. రైతన్నలకు అండగా జనసేన నిలబడుతుందన్నారు.
పదవులు అలంకారం కాకూడదు : పార్టీకి నాయకులు కంటే జన సైనికులు, వీర మహిళలే పెద్ద బలం. క్షేత్రస్థాయిలో వారి పోరాట పటిమ జనసేన పార్టీకి పెద్ద ఆస్తి. చిన్న స్థాయి కూలీల దగ్గర నుంచి పైస్థాయి వ్యాపారుల వరకు జనసేన జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్లడం కదిలిస్తుంది. నాయకులకు పదవులు అలంకారం కాకూడదు. జన సైనికులకు అండగా, వారిని క్షేత్రస్థాయిలో నడిపించే తోడుగా నాయకులు ఉండాలి. కేవలం ప్రొటోకాల్ కోసం రాజకీయ పదవులు చేస్తామంటే కుదరదు. రాబోయే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన గౌరవం ఉంటుంది. ఏ ఒక్కరి కష్టాన్ని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోరు. ఓటర్ల జాబితాను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి క్షుణ్నంగా తనిఖీ చేయాలని కోరారు.
ఉమ్మడి పోరాటాలే మన లక్ష్యం : తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అనేది గుర్తించాలి. ఒకవేళ జనసేన పార్టీ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమైన సంఖ్య రాకపోతే, ఓట్లు చీలి మళ్లీ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం అవుతుంది. మళ్లీ కోలుకోలేని పరిస్థితికి వెళ్లిపోతుంది. దీన్ని ఆలోచించే పవన్ కళ్యాణ్ పొత్తు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. ఉమ్మడి పోరాటాలే మన లక్ష్యం. ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. వచ్చే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిపోదని, మరిన్ని మంచి పథకాలను తీసుకొస్తామని చెప్పండి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి భిన్నంగా పాలన చేస్తే మరింత సంక్షేమం ప్రజలకు అందించడం సులభమే అన్న విషయాన్ని ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో వివరించండి. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల్లో ఎంత బలంగా నాయకులు పనిచేస్తే, అంత బలంగా మనం అధికారంలో మనదైన మార్కు వేసుకోగలం. దీన్ని గుర్తుంచుకొని రాబోయే 100 రోజుల్లో బృహత్తర అధికార ప్రణాళికతో ముందుకు వెళదామన్నారు.