ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైమ్స్ స్కేల్ వర్తింపచేయాలి
సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
మహాసభకు ప్రభుత్వం తరపున ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది హాజరు
అందరికీ మేలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం
మహాసభ వేదికగా 15 మందితో రాష్ట్ర కమిటీ ఆవిర్భావం
రాష్ట్ర అధ్యక్షులు గా కె.సుమన్, ప్రధాన కార్యదర్శిగా అల్లం సురేష్
రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహాసభలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కాంట్రాక్టు ఉద్యోగులు వలే కనీస సర్వీస్ కట్ ఆఫ్ పెట్టీ, అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో దళారీల అబద్ధపు మాటలకు మోసపోకుండా వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ దూరంగా ఉండాలని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు సూచించారు. ఆదివారం ఏపీ జెఎసి అమరావతికి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆవిర్భావం అదే వేదికపై ప్రథమ మహాసభ విజయవాడ గాంధీ నగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగింది. మహాసభకు ముఖ్య అతిథులుగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మరియు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, ఎపి జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు హాజరయ్యారు.
మహాసభను ఉద్దేశించి మల్లాది విష్ణు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయలేని సాహసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ పేరుతో ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి దళారీల వ్యవస్థనుండి విముక్తి చేసిందన్నారు. అందరి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ క్రమంలోనే చక్కగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మహాసభ ద్వారా ఏవైతే సమస్యలు నివేదించారో ఆ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం నియమించి ఉన్న మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిత్యం న్యాయమైన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని మెప్పించి , ఒప్పించి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, వారి బృందానికి మల్లాది విష్ణు అభినందనలు తెలిపారు.
ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి : మహాసభను ఉద్దేశించి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు ఏజెన్సీల భారీ నుండి ప్రభుత్వం చిరు ఉద్యోగులను రక్షించి వారికి రక్షణ వలయంగా ఆప్కాస్ ఏర్పాటు చేసినందుకు మహాసభ వేదికగా ముఖ్యమంత్రికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఇటీవల క్రమబద్దీకరణ కొరకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా కాంట్రాక్టు ఉద్యోగులు వలే కనీస సర్వీస్ కట్ ఆఫ్ పెట్టీ, అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ సిబ్బంది చిత్తశుద్ధితో ,క్రమశిక్షణగా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని వారందరికీ సర్ఫ్ ,మెప్మా ఉద్యోగులకి ఏ విధంగా అయితే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేసి భద్రత కల్పించాలని కోరారు. చిన్నపాటి జీతానికి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం బాధాకరమని, ఉద్యోగులందరికీ అమ్మ ఒడి, విద్యా కానుక ,విద్యా దీవెన, వసతి దీవెన ,ఇళ్ల స్థలాలు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుపరచాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారం కోల్పోకుండా ఆ ఉద్యోగి భర్తకు గాని భార్యకు గాని అదే ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పించి ఆయా ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
అధికారుల కమిటీని నియమించాలి : ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల పెంచినదో ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుకుగా నిర్ణయించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై పరిష్కారం కొరకు ప్రభుత్వం ఒక అధికారుల కమిటీని నియమించి నిర్ణీత కాలవ్యవధిలోపు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని బొప్పరాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ ఆప్కాస్ ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాసంత న్యాయం చేసిన ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, గురుకులాలు తదితర శాఖలో ఇంకా ప్రైవేటు ఏజెన్సీలు ఇతర దళారీల కింద నలిగిపోతున్న వారందరినీ విముక్తిపరిచి ఆప్కాస్ పరిధిలోనికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నపాటి జీతానికి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి వారి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.