తుని: తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తుని నియోజకవర్గం ఒంటిమామిడి వద్ద పంటపొలాలను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణాపురానికి చెందిన కౌలురైతు యన్నా బాబ్జి లోకేష్ తో మాట్లాడుతూ నేను 4 ఎకరాల్లో వరి పంటను కౌలుకు సాగు చేశాను. అర ఎకరంలో మిర్చి, మరో అర ఎకరంలో బెండ సాగు చేశాను. వరి, మిరప పంటలు నీటిలో నానిపోయి కుళ్లిపోయాయి. వరిపంట చేతికొచ్చే స్థితిలో లేదు. మిర్చి మొక్కలు కుళ్లిపోయి నేలకొరిగి పాడైపోయాయి. మొత్తంగా రూ.1.70వేలు నష్టం వచ్చింది. నాకు ప్రభుత్వం నుండి కౌలుకార్డు, ప్రభుత్వ పథకాలు ఏవీ రావడం లేదు. గతేడాది కూడా నేను వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యంమని ఆవేదన చెందారు. తాటేరుపాలెంకు చెందిన మరో కౌలురైతు వీరబాబు మాట్లాడుతూ నేను 3 ఎకరాల్లో వరిపంట కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. మిచౌంగ్ తుఫాను వల్ల పంట మొత్తం నేలకొరిగిపోయింది. వర్షపునీరు పొలాల్లో చేరి పంట మొత్తం కుళ్లిపోయింది. పంట కోత కోసినా ఉపయోగం లేదు. ఇప్పటి వరకు రూ.70వేలు పెట్టుబడి పెట్టాను. జమ్మేరు పూడిక నాలుగేళ్లుగా తీయడం లేదు. దీనివల్ల మా పొలాలన్నీ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నాం. మాకు కౌలుకార్డు లేదు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని విన్నవించాడు.
ఒంటిమామిడికి చెందిన కాకాడ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతియేటా మాకున్న 60సెంట్ల పొలంలో పండించుకున్న ధాన్యం తిని బతుకుతున్నాం. పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్ తుఫాను వల్ల మా తిండిగింజలు మొత్తం నేలపాలయ్యాయి. ఇప్పటివరకు రూ.30వేలు పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం నుండి మాకు ఇన్ పుట్ సబ్సిడీలు, పంట బీమాలు ఏవీ రావడం లేదని వాపోయాడు. ఈ సందర్భంలో లోకేష్ రైతులతో మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం చేసేలా మేం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పంటను సాగుచేసే వారికి అందాల్సిన పథకాలను పారదర్శకంగా అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. కౌలు రైతులు నష్టపోకుండా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.