విజయవాడ : కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
[https://bloomtimes.org/images/srilekha_/Nirmala%20sitaraman.jpg]
[https://bloomtimes.org/images/srilekha_/Nirmala%20sitaraman.jpg]