బాధిత కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పిన నాదెండ్ల మనోహర్
విశాఖపట్నం : ఆపదలో అండగా నిలుస్తూ, కార్యకర్తలను సొంత కుటుంబంగా భావించే పార్టీ జనసేన అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉమ్మడి విశాఖకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కులు అందించారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున అందజేశారు. శుక్రవారం విశాఖపట్నంలో బాధిత కుటుంబాలను మనోహర్ పరామర్శించారు. ప్రమాద వివరాలను, కుటుంబ పరిస్థితి తెలుసుకుని వారికీ ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన కార్యకర్తల కుటుంబాలతో మాట్లాడుతూ ఎంతో ఉన్నత ఆశయంతో జనసేన క్రియాశీలక కార్యకర్తలకు బీమా చేయించారని అన్నారు. ముందు చూపుతో ఆయన తీసుకున్న నిర్ణయం ఎన్నో కుటుంబాలకు దారి చూపుతోందన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన క్రియాశీల కార్యకర్తలు చామంతుల చంద్రరావు (అనకాపల్లి నియోజక వర్గం), ఉరిటి అప్పలరాజు (పెందుర్తి నియోజక వర్గం) , కలిగాట నాగేశ్వరరావు (ఎలమంచిలి నియోజక వర్గం) ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వారి కుటుంబాలకు మనోహర్ పరిహారం చెక్కులు అందించారు. అలాగే వివిధ ప్రమాదాల్లో గాయపడిన పుట్టా సాయి తేజ (విశాఖ ఈస్ట్ నియోజక వర్గం), దిట్టకవి ఉమా సుశీల (విశాఖ నార్త్ నియోజక వర్గం), జామి సూర్య జగదీష్ (విశాఖ నార్త్ నియోజక వర్గం), సేనాపతి చైతన్య కుమార్ (పెందుర్తి నియోజక వర్గం)కు రూ. 50 వేలు చొప్పున మెడిక్లెయిమ్ చెక్కులు అందజేశారు. పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్రియాశీల సభ్యత్వ వాలంటీర్లు పాల్గొన్నారు.