విశాఖపట్నం : వైసీపీ నాయకులు, పాలకుల వేధింపులతో సతమతమవ్వని వర్గమంటూ ఏదీ లేదు.. శాంతిభద్రతలు క్షీణించాయి.. యువతకు, మహిళలకు భరోసా లేదు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలు, కష్టంలో ఉన్నప్పుడు స్పందించిన విధానం కచ్చితంగా మనల్ని నిలబెట్టాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకొంటూ క్షేత్ర స్థాయిలో బలంగా పని చేయాల్సిన తరుణమిది అన్నారు. ఉన్న సమయం కేవలం మూడు నెలలు మాత్రమే. ఓటర్ల జాబితా పర్యవేక్షణ, కొత్త ఓటర్ల నమోదు నుంచి ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అని తెలిపారు. విశాఖ నగర, విశాఖ రూరల్ జిల్లా నాయకులు, పి.ఏ.సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అసెంబ్లీ బాధ్యులు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలతో శుక్రవారం ఉదయం విశాఖపట్నంలో సమావేశం అయ్యారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, మన యువత భవిష్యత్తు కోసం తీసుకున్న కీలక నిర్ణయానికి అందరి మద్దతు ఉంది. మన ఓటు శాతం ఎంతో పెరిగింది. ఒంటరిగా పోటీ చేస్తే మెరుగైన స్థానాలు దక్కించుకొంటాము. ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపక్షం వహించాలంటే పొత్తు ద్వారా అడుగులు వేయాల్సిందే. అందుకే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. భాగస్వామ్య పక్షంతో గౌరవం ఇచ్చిపుచ్చుకుందాం. అలాగే ప్రజల కోసం పని చేయకుండా, ఎన్నికల సమయంలో పకడ్బందీగా వ్యూహాలు అనుసరించకుండా గెలిచేద్దామనుకోవడం సాధ్యం కాదు. ఎలక్షనీరింగ్ పై అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కలసికట్టుగా పని చేద్దాం. పాలనలోకి వస్తున్నామన్నారు. నాదెండ్ల మనోహర్ గామాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నాం. ఈ నెల 12వ తేదీ తరవాత సమీక్షలు ఉంటాయి. పొత్తులో ఉన్న టీడీపీతో సంయుక్తంగా చేసే కార్యక్రమాలను క్షేత్ర స్థాయి వరకూ చేపట్టాలి. అదే సమయంలో మన పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభావశీలంగా ప్రజల్లోకి తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో పి.ఏ.సి. సభ్యుడు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.