నెల్లూరు : ఒక్క పార్లమెంట్ ఉన్న అండమాన్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి హీనంగా ఉంది అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. శుక్రవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ… మిచౌంగ్ తుఫాన్ కారణంగా చేతికొచ్చిన పంటలను రైతులు నష్టపోయారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ రైతుకు జగన్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. రైతాంగానికి వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడకుండా బస్సు యాత్రలో విహారయాత్ర చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ..సీఎం జగన్ అప్రమత్తతంగా వ్యవహరించలేదు. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహారించింది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ప్యాలెస్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. అరటి, తమలపాకు, వరి, ఉద్యనవన పంటల రైతులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని సత్యకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
తుగ్లక్ పనులు చేస్తే విమర్శించరా : ‘‘పత్రికలు, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఇప్పుడు సీఎం జగన్ బయటకు వచ్చాడు. పక్కన ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం తీసుకున్న చర్యలు కూడా జగన్ ప్రభుత్వం తీసుకోవడం లేదు. కేంద్రం రైతులకు ఇచ్చే అవకాశలను మిగిలిన రాష్ట్రాలు వినియోగించుకుంటుంటే ఏపీకి మాత్రం ముందుకు రావడం లేదు. చేసిన వాటినే మళ్లీ, మళ్లీ శంకుస్థాపనలు చేసుకోవడం తప్పా ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. రైలు ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే ఏరియల్ సర్వే చేశారు. తుగ్లక్ పనులు చేసినప్పుడు ప్రతిపక్షాలు, పత్రికలు సీఎం జగన్‌ని విమర్శిస్తే వెంటనే కోపం వస్తుంది. స్వర్ణముఖి కరకట్టలు పనులకు కమీషన్లు డిమాండ్ చేస్తే కాంట్రాక్టర్ వెళ్లిపోయినది నిజం కాదా.? దోచుకున్నది దాచుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో కనిపించడం లేదు. వరి పంటకు 30 వేలు, ఉద్యానవన, ఉప్పు రైతులకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి. ఎన్నికలు సమీపిస్తుడడంతో పాప పరిహారం చేసుకునేందుకు సీఎం జగన్ ఇప్పుడు భయటకు వచ్చాడని సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.