అమరావతి : ఏపీలో డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవారికి ఏపీలోనూ ఓట్లున్నాయని ఈసీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈసీ అప్రమత్తం అయింది. డూప్లికేట్, డబుల్ ఓటు ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తికి ఒకటికన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరుద్ధం. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు వేరే ఎక్కడా ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.