ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
విజయవాడ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ పట్టణ ప్రాంత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, జన ఔషధి సుగమ్ పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు 100 శాతం లబ్ధిదారులకు చేర్చే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతోందన్నారు. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పథకాలపై అవగాహన కల్పించి అర్హత ఉండి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా పథకాలను వర్తించేలా చేస్తున్నట్లు వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వారికి కూడా పథకాలను చేరువచేసే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం అమలవుతోందన్నారు. మహిళా సారథ్యంలోని అభివృద్ధికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళలు, స్వయం సహాయ సంఘాల మహిళలు వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. ఈ డ్రోన్లను ఉపయోగించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు వెల్లడించారు. వందేళ్ల స్వాతంత్య ఉత్సవాలలోపు అమృతకాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు భారత్‌ను, ప్రజలను ఉన్నత శిఖరాలకు చేర్చుతాయన్నారు. ప్రజల జీవన నాణ్యతను పెంచడంతో పాటు పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలను తొలగిస్తాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐఈసీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. సమాజానికి విశేష సేవలందించిన వారిని సత్కరించారు. జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశాన్ని కూడా ప్రదర్శించారు. ప్రభుత్వ విజయాలను తెలిపే వీడియోను కూడా ప్రదర్శించారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యం: ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతోందని.. గురువారం నుంచి రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో యాత్ర జరుగుతుందని గృహ నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. పీఎం స్వానిధి, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం కిసాన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. ఇలా 20 వరకు వివిధ పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించి.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందాలనే లక్ష్యతో భారత ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అజయ్ జైన్ వివరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధీ ముఖ్యం: కలెక్టర్ ఎస్.డిల్లీరావు
దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు సామాజికంగా అభివృద్ధి సాధించాలని.. అప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. 2047లోగా స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా గొప్ప పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న ప్రారంభమై జనవరి 26 వరకు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని.. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని.. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికీ పథకాలు, కార్యక్రమాల ఫలాలను చేరువచేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యంగా ప్రభుత్వాల కృషి: శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్
పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషిచేస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికీ చేరాలనే గొప్ప లక్ష్యంతో భారత ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారన్నారు. పేదరికాన్ని రూపుమాపి వారి అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాల్లో పలు పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభ్యున్నతికి రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయనేదానికి ఈ రోజు కార్యక్రమంలో ఆవిష్కృతమైన వివిధ పథకాల లబ్ధిదారుల మనోగతమే నిదర్శనమని పేర్కొన్నారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు మరింత చేరువకావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పథకాల అమలు: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఒక్క విజయవాడకు సంబంధించి 36 వేల మందికి పైగా స్థలాలు అందించి.. ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. పీఎం స్వానిధి, జగనన్న తోడు, ముద్రా యోజన, రైతు భరోసా-పీఎం కిసాన్ తదితర పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మేయర్ భాగ్యలక్ష్మి
పేర్కొన్నారు.
దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి: జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక
దేశ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్‌ను 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికీ పథకాలు అందేలా చేయడంలో అందరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.