అనంతపురం : ఏపీలో కూడా బీజేపీ, జనసేనకు మంచి ఫలితాలు వస్తాయని, వ్యూహం ప్రకారం ముందుకెళ్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో చివరి వరకు ఏమైనా జరగొచ్చు. బీజేపీ ఎప్పుడు గాడ్సేను పూజించలేదు. ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురంలో ఎందుకు? కనీసం ఆయన పుట్టిన మైసూర్లో కూడా పెట్టలేదు. టిప్పు సుల్తాన్ విగ్రహ స్థానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని ఎస్పీకు దరఖాస్తు పెట్టం. ఈ దరఖాస్తు ఎప్పుడో పెట్టం. కానీ అనుమతి రాలేదు. ఇంతలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమిపూజ చేశారు. వైసీపీ నాయకులకు ఒక ఛాలెంజ్. వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం పెడదాం. ఎవరి విగ్రహం కావాలో ప్రజలనే అడుగుదాం. కొంతమంది స్వార్థ రాజకీయల కోసం విగ్రహాల మీద పడ్డారు. కొంతమంది శాంతిగా ఉండే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా వైసీపీ చేస్తోంది. మేము కూడా 10 రోజుల్లో వేలమందితో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతాం. అధికారులు కూడా ఒకరికే కొమ్ము కాసే విధంగా ప్రవర్తించికండి. అనంత వైసీపీ అర్బన్ టికెట్ కోసం ఈ ప్రయత్నలు చేస్తున్నారు. మీ టికెట్ పంచాయితీ తాడేపల్లిలో తేల్చుకోండి. ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో కాదని సూచించారు.