అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా మిచాంగ్ తుఫాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్ట జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను వదలడం లేదని శాసనమండలి పక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తుఫానుపై వారం నుంచే హెచ్చరికలు ఉన్నా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని, తుఫానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి జగన్ రెడ్డి చేతులు దులుపుకున్నారన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడపాల్సిన పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రిగాని, సాగునీటి శాఖ మంత్రిగాని ప్రజల, రైతుల గోడు కనీసం పట్టలేదు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.7వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి, కుప్పలపైన, ఆరబోసిన వరి తీవ్రంగా దెబ్బతింది. కోత కోసిన చోట వరి పనలు నీటిలో తేలియాడుతూ రైతులను కన్నీటిలో ముంచాయి. పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 8 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ముంపు ప్రాంతాల్లో ఇంటికో భోజనం పొట్లం ఇచ్చి సరిపెట్టుకోమనడం జగన్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. పలు చోట్ల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో నిర్లక్ష్యం చూపారు. రైతులకు అవసరమైన టార్ఫాలిన్లు గోనె సంచులు పంపిణీ చేయలేదు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరు అలెర్ట్ గా ఉండాల్సిన ఈ విపత్తు పట్ల జగన్ రెడ్డి మొద్దునిద్ర పోతూ రైతు కష్టాన్ని వరదపాలు చేశారు. ఇప్పటికైనా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని, తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారన్నారు.