మహాసభ వేదికగా రాష్ట్ర కమిటీ ఆవిర్భావం
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మహాసభకు వేలాదిగా తరలి రండి
విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పిలుపు
విజయవాడ : ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 10న విజయవాడ జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్ లో రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభ జరుగుతుందని ఈ మహాసభకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, అలాగే ఏపీజేఏసీ అమరావతి, కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం చేయుటలో భాగంగా మంగళవారం 26 జిల్లాల్లో జరుగుతున్న మీడియా సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ రెవెన్యూ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ డి.ఈశ్వర్, అసోసియేట్ చైర్మన్ డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడ రెవెన్యూ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీవీ ఫణిపేర్రాజు, బత్తిన రామకృష్ణ, అల్లం సురేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వారు 26 జిల్లాల్లో జిల్లా కమిటీలను పూర్తిచేసి డిసెంబర్ 10వ తేదీన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతున్న కారణంగా అదే రోజు రాష్ట్ర స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ ఏర్పాటు చేసి మహాసభ వేదిక ద్వారా ప్రభుత్వానికి సమస్యలు విన్నవించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఏజెన్సీల దోపిడీకి బలి పశువులైన ఉద్యోగులను వారి భారి నుండి విముక్తి పరిచి రాష్ట్ర ప్రభుత్వం ఔటసోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆప్కాస్ ను ఏర్పాటు చేసి ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు అందిస్తూ కాసంత మేలు చేసిందన్నారు ఆప్కాస్ ఏర్పాటు అయినప్పటికీ ఉద్యోగులకు శ్రమకు వేతనం లేనప్పటికీ దీనికి తోడు ప్రభుత్వ పథకాలు ఇతర రాయితీలు నిలిపివేయడం జరిగిందన్నారు.
అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సగటు ఔట్సోర్సింగ్ చిత్తశుద్ధితో అభద్రతాభావంతో పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని తెలుపుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ యూనిటీగా ముందుకు సాగి ప్రభుత్వానికి చిరుద్యోగులు ఐక్యతను చాటాలన్నారు. మహాసభకు ఎన్టీఆర్ జిల్లా మరియు దాని పరిధిలో ఉన్న అన్ని శాఖాధిపతుల కార్యాలయాల నుండి అధిక సంఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డి.ఈశ్వర్ మాట్లాడుతూ చిరు ఉద్యోగులకు ఏపీజేఏసీ అమరావతి అండగా ఉంటుందని వారి సమస్యల పట్ల కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకుని వెళుతున్నారని తెలిపారు. ఉద్యోగులు ఐక్యంగా సమస్యలపై ముందుకు వెళ్లాలి తప్ప ఒక్కొక్కరుగా వెళ్లకూడదని, అన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి జిల్లాల వారీగా అసోసియేషన్ గా ఏర్పడడం ఐక్యతకు చిహ్నం అని తెలియజేశారు. డిసెంబర్ 10న జరిగే రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభకు రాష్ట్రం నలుమూలల నుండి, ఎన్టీఆర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
ఏపీ జెఎసి అమరావతి ఎన్టీఆర్ జిల్లా అసోసియేట్ చైర్మన్ డి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎప్పుడైతే ఐక్యంగా పోరాడుతామో అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఐక్యంగా ఉండడం ఉద్యోగులవంతని సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం వంతుగా భావించి ఐక్యతను చూపేందుకు డిసెంబర్ 10న జరిగే రాష్ట్ర స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ సభకు రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ వేలాదిగా హాజరై ఐక్యతను చాటాలన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మహాసభను ఉపయోగించుకుని ప్రభుత్వం ద్వారా రావాల్సిన హక్కులు రాయితీలు సాధించుకోవాలని ఉద్యోగులకు సూచిస్తూ అందరూ ఉద్యోగులు ఐక్యంగా ఉన్నారని సంకేతం మహాసభ విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బి రామకృష్ణ, ,కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వి సతీష్, కృష్ణాజిల్లా అధ్యక్షులు, శాంతారామ్, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సుశీల, అసోసియేషన్ నాయకులు సంపత్, యానాది బాబు, సుధీర్, భూషణం తదితరులు పాల్గొన్నారు.