విజయవాడ : విద్యారంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు సైతం తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ సురేష్ కుమార్ అన్నారు. నిరంతర శిక్షణ, పునశ్చరణ ద్వారానే సాంకేతిక విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలను సాధించగలుగుతామని స్పష్టం చేసారు. విజయవాడ నగర శివారులోని ధనేకుల ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న అటల్ ఫ్యాకల్టీ అభివృద్ది కార్యక్రమాన్ని పరిశీలించారు. డిసెంబరు 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనునుండగా “అడ్వాన్స్ మెంట్ ఆన్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఫ్రమ్ ధియరీ టు ఫ్రాక్రీస్” అనే అంశంపై ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, కళాశాల విద్యలో నాణ్యతను మెరుగుపరచడానికి, విద్యా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు కావాలన్నారు. ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ పరిశ్రమ నిపుణులు, అనుభవజ్ఞులైన విద్యావేత్తల నేతృత్వంలో ప్రత్యేక వర్క్‌షాప్‌లు, ప్రయోగాత్మక సెషన్లు తప్పనిసరన్నారు. విద్యరంగంలో నూతన సాంకేతికతల ఆవిష్కరణల కోసం పరస్పర జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడానికి శిక్షణలు ఉపకరిస్తాయన్నారు. ఇప్పటికే ఉన్న కోర్సుల్లో కొత్త టెక్నాలజీలను ఏకీకృతం చేసి, పాఠ్యాంశాల అభివృద్ధి మార్గదర్శకత్వం కోసం పరిశ్రమలోని నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగు పరచుకోవాలని సూచించారు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పాన్సర్ చేస్తున్న ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్, సెక్రటరీ, కరెస్పాండంట్ ధనేకుల భవానీప్రసాద్ , డైరెక్టర్ డికెఆర్ కె రవిప్రసాద్ ప్రిన్సిపల్ డాక్టర్ కడియాల రవి, డీన్స్ డాక్టర్ రావి సత్యప్రసాద్, డాక్టర్ ఎ సుధీర్ బాబు, డాక్టర్ డివివి శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం వంశీ కృష్ణ, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కోనేరు సౌమ్య, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారంతో కళాశాలలో నెలకొల్పిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్, ఇజ్రాయెల్ సహకారంతో నెలకొల్పిన డ్రోనిక్స్ లాబరేటరీలను పరిశీలించారు. కళాశాలలోని ఆధునిక సాంకేతిక, పరిశోధన ప్రాజెక్టులను పరిశీలించి తగు సూచనలు చేశారు.