పుట్టపర్తి : ముఖ్యమంత్రి జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ ‘చలో పుట్టపర్తి’కి పిలుపునిచ్చింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి తదితరులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని పెనుకొండ వద్ద ఓ హోటల్లో ఉంచారు. పోలీసులు నిర్బంధించిన హోటల్ వద్ద టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకోలేని ఈ ప్రభుత్వమెందుకని ప్రశ్నించారు. పంటలు ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి పట్టదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పంటలన్నీ ఎండిపోయి రైతులు నష్టపోయారని, సీఎం జగన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణ వాహనం ఎదుట కొందరు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన వాహనాన్ని అడ్డుకుని నల్ల బెలూన్లు ఎగురవేశారు. అనంతపురంలో టీడీపీ నేత ప్రకాశ్నాయుడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.