రూ.2,500 కోట్లతో చేపట్టిన డోన్ అభివృద్ధి పల్లె పల్లెకి చాటేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం వల్లే అభివృద్ధి సాకారం
డోన్ లో రూ.1.10 కోట్లతో నిర్మించిన సచివాలయాలు, ఆర్బేకేలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి
చినమల్కాపురం మేజర్ పంచాయతీలోనే రూ.10 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు
దాన,ధర్మ గుణాలు కలిగిన గ్రామంగా చినమల్కాపురానికి ప్రత్యేక పేరు
నంద్యాల జిల్లా డోన్ : శాశ్వత అభివృద్ధికి చిరునామాగా డోన్ నియోజకవర్గం మారిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్రజలకు తాము గెలిపించుకున్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల మీద ఉన్న నమ్మకం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం డోన్ లోని చినమల్కాపురం మేజర్ పంచాయతీలో రెండు సచివాలయాలు, రెండు రైతు భరోసా కేంద్రాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభించారు. రూ.1.10 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ భవనాలను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చినమల్కాపురం గ్రామం దాన, ధర్మాలున్న ఊరిగా ప్రత్యేకతను కొనసాగిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఒక్క పంచాయతీ పరిధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అక్కడే సచివాలయ భవానానికి స్థలాన్ని దానమిచ్చిన కీర్తీ శేషులు బుగ్గన సునీల్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాతల గుర్తుగా తీర్చిదిద్దిన దొంతిరెడ్డి చిన సుబ్బారెడ్డి విగ్రహాలను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. స్వర్గీయ చినసుబ్బారెడ్డి సేవలను మంత్రి కొనియాడారు.
చినమల్కాపురం గ్రామ ప్రజల అభిమానం మరవలేనిదన్నారు. తనను గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు, బిడ్డలను చదివించుకుంటున్న 800 మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అమ్మ ఒడి కింద రూ.3.70 కోట్లు అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యాదీవెన కింద 400 మంది చిన్నారులకు రూ.కోటి రూపాయలు, వసతిదీవెన కింద 315 మందికి రూ.50 లక్షలు, వ్యవసాయ రంగంలో దుక్కి దున్ని శ్రమిస్తోన్న 1000 మంది రైతన్నలకు రూ.5కోట్లు, 900 మందికి సామాజిక పెన్షన్ల ద్వారా రూ.9 కోట్లు, చేయూత పథకం ద్వానా 390 మందికి 1.80 కోట్లు , నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు స్కీమ్ ద్వారా 266 మందికి ఇంటి పట్టాలు ఒక్క చినమల్కాపురం గ్రామ పంచాయతీ ప్రజలకే అందజేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. సంక్షేమం మాత్రమే కాకుండా రూ.20 లక్షలతో ఎస్సీ కమ్యునిటీ భవనం, రూ.10 లక్షలతో స్మశాన వాటిక, రూ.కోటి ఖర్చు చేసి రహదారులు, డోన్ నియోజకవర్గ ప్రజల కోసం 100 పడకల ఆస్పత్రి, రూ.350 కోట్లతో గోరుకల్లు జలాశయం ద్వారా డోన్ నియోజకవర్గంలోని ఇంటింటికీ త్రాగునీరు, రూ.750 కోట్లతో బేతంచెర్ల-డోన్ వరకూ జాతీయ రహదారి, మద్దిలేటి పుణ్యక్షేత్రానికి రూ.50 కోట్లతో తీర్చిదిద్దుతూ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో ఒకటిగా మార్చుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అంతకుముందు చినమల్కాపురానికి వచ్చే ముందు డోన్ పట్టణంలోని అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. రూ.15 లక్షలతో నిర్మిస్తోన్న టేబుల్ టెన్నిస్ కోర్టు నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరవనాన్ని సందర్శించారు. అక్కడ చేపడుతున్న పనులను మంత్రి బుగ్గన పరిశీలించి పలు మార్పులకు ఆదేశాలిచ్చారు.
డోన్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.2,500 కోట్లతో డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధిపై “ప్రగతి రథం- బుగ్గన మార్గం” పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డోన్ నియోజకవర్గంలోని గ్రామం, మండలాల వారీ నాలుగేళ్లలోనే చేసిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వినూత్న ప్రచారం నిర్వహించనున్నారు. పల్లె పల్లెలూ తిరిగి మంత్రి బుగ్గన హయాంలో జరిగిన అభివృద్ధి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించనున్నారు. స్వయంగా మంత్రి బుగ్గన వెళ్లి ప్రత్యక్ష్యంగా ఆయా ప్రాంతాల ప్రజలకు చెబుతున్నట్లుగానే సంబంధిత ఊళ్ల అభివృద్ధిని చూపుతూ వీడియోలను ప్రదర్శించేందుకు సన్నద్ధమయ్యారు. 100 రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ఒక గంట ప్రదర్శనకు వీలుగా ప్రగతి రథం షెడ్యూల్ రూపొందించినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఊరి జనాన్ని ఒక చోట చేర్చి కళా ప్రదర్శనలిచ్చే పాత రోజులను గుర్తు చేసేలా కొత్తగా ప్రచారం ప్రారంభించడం పట్ల ఇప్పటికే గ్రామాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.