9న రెండు పార్టీల సంయుక్త సమావేశం
త్వరలో కరపత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు
టీడీపీ అధినేతకు జనసేనాని పరామర్శ
*గుంటూరు : ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని, ఆ దిశగా ఏకాభిప్రాయ అంశాలతో కరపత్రం విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిర్ణయించారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో శనివారం దాదాపు రెండున్నర గంటల పాటు వీరిద్దరూ భేటీ అయ్యారు. చంద్రబాబును పవన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే విషయమై మరింత ఏకాభిప్రాయం సాధించారు. రాబోయే రోజుల్లో తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 9న నిర్వహించే సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో ఉమ్మడి ఎజెండాపై చర్చించనున్నారు. జనంలోకి ఎలా వెళ్లబోయేదీ సంయుక్తంగా నిర్ణయిస్తారు. ఉమ్మడి మ్యానిఫెస్టోపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. రాజమహేంద్రవరం మహానాడులో ఆరు ముఖ్యాంశాలతో తన ప్రాథమిక మ్యానిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. ఇప్పటంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ‘షణ్ముఖ వ్యూహం’ పేరుతో ఆరు అంశాలను జనసేన ప్రకటించింది. వీటితో పాటు మరికొన్నింటిని ఉమ్మడి మ్యానిఫెస్టో కోసం జనసేన ప్రతిపాదించినట్లు తెలిసింది. కమిటీలో చర్చించి వీటికి తుదిరూపు ఇవ్వనున్నారు. ఈలోపు ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏకాభిప్రాయ అంశాలతో ఉమ్మడి కరపత్రం విడుదల చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటింటికీ ప్రచారం చేయనున్నారు. వైకాపా ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించాలో వివరించనున్నారు.
రెండు పార్టీలూ ఇక నుంచి ఉమ్మడి ఎజెండాతో కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రెండు పార్టీల సర్వసభ్య సమావేశాల్నీ కలిపి నిర్వహించాలనే ప్రతిపాదనపైనా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైనా చంద్రబాబు, పవన్ మాట్లాడుకున్నారు. కరవు పరిస్థితులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, చంద్రబాబుపై వరుస కేసులు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సమావేశంలో ఏం జరిగిందో టీడీపీ, జనసేన ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
అయినా మీరు దృఢంగా నిలిచారు: చంద్రబాబుతో పవన్‌కల్యాణ్
జైలులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూసింది. మానసికంగా బలహీనుల్ని చేయాలని ప్రయత్నించింది. అయినా గట్టిగా ఎదుర్కొన్నారు. ఎంతో దృఢంగా నిలబడ్డారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి’ అని చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ అన్నారని తెలిసింది. జైలుకు వచ్చి మద్దతు ప్రకటించినందుకు పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారని సమాచారం.