ప్రజల సమస్యలకు పరిష్కారానికి నాయకులు కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే..చాగల్లు మండల అవగాహన సదస్సులో హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు : జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి జరిగిన మంచి, వారికి అందిన లబ్దిని వివరించాలని జి సి ఎస్ కన్వీనర్లు గృహసారథులు వాలంటీర్లకు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దిశా నిర్దేశం చేశారు. శనివారం నెలటూరులో శ్రీ సీతా రామ కళ్యాణమండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే అనే విషయంపై చాగల్లు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకుల, కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించారు. ప్రజలెవరైనా సమస్యతో వస్తే నాయకులు వారి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్లలో మీకు గానీ, మీ కుటుంబంలో గానీ ఎవరికైనా మంచి జరిగిందని అనుకుంటేనే మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ధైర్యంగా చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటివద్దకే అందించారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కులమతాలకు, పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను ప్రతిఇంటికీ అందించారన్నారు. జగనన్న పాద యాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని తెలిపారు.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లిస్తేనే పథకాలు అందేవని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయపార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కానీ నేడు జగనన్న 99 శాతం అమలు చేసి చూపించాడన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకై క నాయకుడు మన జగనన్న అని తెలిపారు. జగనన్న పేదల పక్షాన నిలబడి మన కోసం యుద్ధం చేస్తున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చామన్నారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, అంగన్ వాడీ స్కూల్స్ అభివృద్ది ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరికోసం చేశారో వాళ్లందరికీ ఓటు హక్కు కూడా లేదన్నారు. అంటే సీఎం పిల్లల భవిష్యత్ కోసమే అభివృద్ధి చేశారు తప్ప రాజకీయాల కోసం కాదని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. నవంబర్ 9 నుంచి క్యాంపెయిన్ మొదలు అవుతుందని, నాయకులందరూ తప్పనిసరిగా పల్లెనిద్ర చేయాలన్నారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/Thaneti%20vanitha1.jpg]