గుంటూరు : జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంపై విమర్శలు గుప్పించారు. కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ‘వర్షాభావ పరిస్థితులపై సమీక్షించకపోవడం బాధ్యతారాహిత్యం. 400 మండలాల్లో కరవు పరిస్థితులు ఉంటే 100 మండలాల్లోనే కరవు ఉందని ప్రభుత్వం ప్రకటించడం దారుణం. వందేళ్లలో ఈ ఏడాదే తక్కువ వర్షపాతమని గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో కరవు కారణంగా ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. తప్పుడు కేసుల్లో ప్రతిపక్ష నేతలను ఇరికించడంపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదు. అడ్డగోలు దోపిడీపై తప్ప కరవు నివారణ చర్యలపై శ్రద్ధ లేదు. యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లోకేశ్ అన్నారు.
చంద్రబాబుపై అక్రమ కేసులపైనే జగన్ ఆలోచన : అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో తీవ్ర కరవు తాండవిస్తున్నా మంత్రి వర్గ సమావేశంలో కనీస చర్చ లేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను జగన్ రెడ్డి మోసం చేశారు. లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చ లేదు. వ్యవసాయం రంగం పట్ల జగన్ ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా?’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.