నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత మేకపాటి గౌతంరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక డైకాస్ రోడ్డు కూడలిలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన వారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యులుగా గౌతంరెడ్డి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఉన్నత వ్యక్తిత్వం, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి స్నేహపూర్వక రాజకీయాలను గౌతంరెడ్డి ప్రోత్సహించేవారని ప్రశంసించారు. గౌతంరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేద్దామని మేయర్ ఆకాంక్షించారు.