అనకాపల్లి : రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరుగును రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద జెండా ఊపి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ మంగళవారం ప్రారంభించారు. అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి పోలీస్ అధికారులు, విద్యార్థులతో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం, ఉదయం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ (ఐక్యత కొరకు పరిగెడదాం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి గా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని, దేశ ఐక్యతను పెంపొందించడం, భారతదేశ చరిత్రకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడం ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు.
అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో చేరేలా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతదేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ను జరుపుకుంటామన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ పరుగు అనకాపల్లి జిల్లా పోలీసులు, వివిధ కళాశాల విద్యార్థులు, ప్రజలు రింగ్ రోడ్ జంక్షన్ లో జిల్లా ఎస్పీ ఐక్యత పరుగును జెండా ఊపి ప్రారంభించారు. అనకాపల్లి రింగ్ రోడ్డు జంక్షన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు అనకాపల్లి జిల్లా పోలీసులు, వివిధ కళాశాల విద్యార్థులతో పరుగు తీసి, నాలుగు రోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయభాస్కర్, అదనపు ఎస్పీ (క్రైమ్స్) పి.సత్యనారాయణ రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ వి.సుబ్బరాజు, దిశా డిఎస్పీ మళ్ల మహేశ్వరరావు, ఏ.ఆర్ డిఎస్పీ పి.నాగేశ్వరరావు, అనకాపల్లి రూరల్ సర్కిల్ సిఐ రవికుమార్, అనకాపల్లి టౌన్ ఎస్సై సింహాచలం, ఏ.ఆర్ ఎస్సై ఆదినారాయణ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.